Share On

నాయ‌కులు మాట‌లు వినివిని వారికి విసుగొచ్చింది.. మాట‌లు చెప్ప‌డానికే కాని ప‌నులు చేయ‌డానికి కాద‌ని వారికి అర్థ‌మైపోయింది.. మ‌గ‌వాళ్లు కూడా ఉద‌యం ఏదో ఒక ప‌నికి వెళ్లి మ‌ళ్లీ సాయంత్రం ఇంటికి వ‌స్తారు. కాని ఇంట్లో ఉంటే స‌మ‌స్య‌ల‌పై ఆడ‌వారికే అవ‌గాహ‌న ఉంటుంది. తాగ‌డానికి, వాడుకోవ‌డానికి నీరు లేదు. నీరు కావాలి.. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, ఎంత‌మంది నాయ‌కులు, అధికారుల‌ను క‌లిసినా ఎక్క‌డ వేసినా గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా మారిపోయింది. అందుకే ఆ గ్రామంలోని మ‌హిళ‌లే న‌డుం బిగించారు.. త‌మ గ్రామానికి మేమే నీరు తెచ్చుకుంటామ‌ని ఒక్క‌టి కాదు, రెండు కాదు ప‌ద్దెనిమిది నెల‌ల క‌ష్ట‌ప‌డి వారి గ్రామానికి నీరు తెచ్చుకున్నారు ఆ మ‌హిళ‌మ‌ణులు..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖజురహో ఆలయాలకు నెలవైన ఛత్తర్ పూర్ జిల్లా మారుమూర గ్రామం అంగ్రోత. దాదాపు రెండొందల కుటుంబాలుండే ఆ ఊరికి నీటి తిప్పలు. ఊరికి పుష్కలంగా నీరు అందాలంటే..అడవిలో పారే నీళ్లను తమ గ్రామానికి మళ్లించుకోవాలి. అలా మళ్లించుకోవాలంటే అరకిలోమీటర్ పొడవున ఓ కొండ ఉంది. ఆ కొండను తవ్వితే నీరందుతుంది. ఊరికి నీళ్ల బాధను దూరం చేసే బాధ్యతను మహిళలు స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్నారు. జల్ సహేలీ పేరుతో ఒక‌ బృందంగా ఏర్పడిన 250మంది మహిళలు 18నెలల పాటు శ్రమించి అరకిలోమీటర్ కొండను తవ్వారు. అడవిలో పారే నీళ్లు ఊరి చెరువుకు వచ్చేలా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ తాము కొండను తవ్వుతున్నట్లు అధికారులకు తెలిసినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వ సహకారం లేకపోయినా గ్రామస్థుల సహకారంతో కొండను తవ్వి గ్రామానికి నీరొచ్చేలే చేశామని గర్వంగా చెబుతున్నారు. చివరికి మీడియా ద్వారానే తాము చేసిన కష్టం ప్రపంచానికి తెలిసిందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమగ్రామాన్ని గుర్తించాలని కోరుకుంటున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!