Share On

కేర‌ళ అన‌గానే అంద‌రికి మొద‌ట గుర్తుకొచ్చేది ఎంతో అంద‌మైన ప్ర‌కృతి ప్ర‌దేశాలు.. ఆ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఉత్తేజ‌ప‌రిచే సంప్ర‌దాయం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఆ రాష్ట్రానికే స్వంతం.. అక్ష‌రాస్య‌త‌లో కూడా కేర‌ళ‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వాటితో పాటు ఆ రాష్ట్రంలో ఒక ప్ర‌త్యేక‌మైన యుద్ద విద్య ఉంటుంది.. ఆ రాష్ట్రంలో యువకులే కాకుండా మ‌హిళ‌లు కూడా ఆ యుద్ద విద్య‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తారు.. అదీ దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కించుకుంది. అదే క‌ల‌రిప‌ట్టు.. కాని క‌ల‌రిప‌ట్టును మూలం, దానిని న‌డిపిస్తున్న‌ది ఒక మ‌హిళ..‌

కేర‌ళ‌లోనే ప్రాచుర్యంలో ఉన్న ఒక యుద్ధ విద్య క‌ల‌రిప‌ట్టు. ఈ యుద్ధ విద్య నేర్చుకోవడం చాలా కష్టం. చిన్నతనంలోనే మొదలుపెట్టి చాలా సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ యుద్ధ విద్య నేర్చుకోలేము. పురుషులకే చాలా కష్టమైన ఈ విద్య నేర్చుకోవడమే కాదు ఆ విద్య నేర్పే స్కూలును విజయవంతంగా నడుపుతున్న మహిళ మీనాక్షి అమ్మ‌. 2017లో పద్మశ్రీ అవార్డు పొందే వరకు పెద్దగా ప్రచారం లేని మీనాక్షిఅమ్మ 1941లో కేరళలో జన్మించింది. వీళ్ళ ఇంట్లో పూర్వం నుండి యుద్ధ విద్యలు నేర్చుకునేవారు. అలానే మీనాక్షి అమ్మ కూడా 7 సంవత్సరాల వయసులోనే కేరళలోని కోజికోడ్ జిల్లాలో వడక్కర అనే గ్రామంలో రాఘవన్ అనే వ్యక్తి నడుపుతున్న కడతానందన్ అనే కలరీ పాఠశాలలో చేరింది. 17 సంవత్సరాల వయసులో ఆ పాఠశాల నడుపుతున్న రాఘవన్ గారిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి కలరిపట్టులో మరింత నైపుణ్యం సాధించింది. ఈ విద్యలో శారీరక బలంతో పాటు మానసిక ధైర్యం, సమయస్ఫూర్తి, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి లక్షణాలు ఉండాలి. ప్రమాదకరమైన ఆయుధాలు బాకు, కత్తి, గునపం, ఈటె, డాలు వంటి ఆయుధాలు వాడుతారు. వీటన్నిటిని చేతపట్టి పోటీలలో మగవాళ్లనే ఓడించేది.

భర్తతో పాటే కొన్ని వేల మందికి కలరిపట్టును నేర్పింది. 2009లో భర్త మరణించిన తరువాత ఈ పాఠశాల తానే నడపడం మొదలు పెట్టింది. సంవత్సరానికి 150 నుండి 160 మందికి కలరిపట్టు నేర్పుతోంది. ఇందుకు గాను ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా నేర్పుతుంది. విద్యార్థులు నేర్చుకోవడం పూర్తయిన తరువాత గురుదక్షిణగా ఎంతైనా ఇవ్వవచ్చు. కేవలం ఈ విద్యలో వాడే నూనె ఖర్చు మాత్రమే విద్యార్థులు భరించాలి. ఈమె కృషి, పట్టుదలను గుర్తించిన భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. 79 ఏళ్ళ వయసులో కూడా అలుపు లేకుండా కష్టపడుతున్న ఈవిడ ఎందరికో స్ఫూర్తి. ఈమె ఇరువురు కుమారులు, ఇరువురు కుమార్తెలు అందరూ ఇలాంటి కలరిపట్టు నేర్పే పాఠశాలలు నడుపుతున్నారు. ఈ ప్రాచీన యుద్ధ విద్య అంతరించిపోకుండా చూస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఈ విద్యను ఒక పాఠ్యఅంశముగా చేర్చాలని, ముఖ్యముగా ఆడపిల్లలు అందరూ ఈ విద్య నేర్చుకోవాలని మీనాక్షి అమ్మ కోరిక. ఇదే కలరిపట్టు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లి కుంగ్ ఫు, కరాటే లంటూ మార్షల్ ఆర్ట్స్ పేరుతో మళ్ళీ దేశంలోకి వచ్చింది. వాటిపై ఉన్న ప్రేమ మన సంప్రదాయ విద్య కలరిపట్టుకు ప్ర‌త్యేక‌మైనా గుర్తింపు మాత్రం ద‌క్క‌డం లేదు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!