Share On

మాట మీద నిల‌బ‌డేవారు.. పార్టీ సిద్దాంతాల కోసం ప్రాణాలు ఇచ్చేవారు.. ల‌క్ష‌ల్లో ఎక్క‌డో ఒక‌రు, ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఉంటారు.. పార్టీ పిలిచిందంటే ఉన్న ప‌ద‌విని సైతం వ‌దిలేసి, క‌ట్ట‌బ‌ట్ట‌ల‌తో వాలిపోయే నాయ‌కులు రోజురోజుకు త‌గ్గిపోతున్నారు. ఇప్పుడంతా అధికారం, ప‌ద‌వి వ్యామోహం, అక్ర‌మంగా వ‌చ్చే ల‌క్ష‌ల, కోట్ల రూపాయ‌ల‌ను సంపాదించుకోవ‌డం, త‌మ పిల్ల‌ల‌కు కాకుండా వారి పిల్ల‌ల‌కు అలా త‌ర‌త‌రాలు తిన్న త‌ర‌గని అవినీతి సంప‌ద‌ను పోగు చెయ్య‌డ‌మే ఇప్ప‌టి నాయ‌క‌త్వం ప‌ని. నిజంగా ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచిన వారు, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే వారు ఇప్ప‌టి త‌రంలో ఉన్నారా అంటే భూత‌ద్దం పెట్టి మ‌రీ వెతికి వెతికి చూడాల్సిందే.. ఐనా ఆ కాలంలో నీతిగా, నిజాయితీగా ప‌నిచేసి అతి సామాన్య జీవితం గ‌డుపుతున్న వారు ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఉంటారు. వారిని ఇప్ప‌టి రాజ‌కీయం ప‌ట్టించుకోదు. స‌మాజానికి ప‌రిచ‌యం చేయాల‌నే ప్ర‌య‌త్నం చేయ‌దు. అలాంటి వారిని ప‌రిచ‌యం చేసేందుకు ఈ ముంద‌డుగు..

మ‌న భారతదేశంలో ఒక రాష్ట్ర గవర్నర్‌కు నెల జీతం 3.5 లక్షల రూపాయలతో పాటు ప్రభుత్వ బంగళా, కారు. సేవకులు, అధికారం, లేనిదంటూ ఉండ‌క అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తారు. గ‌వ‌ర్న‌ర్ అంటేనే రాష్ట్రానికి ప్ర‌థ‌మ పౌరుడు. అదొక రాజ‌భోగం లాంటి ప‌ద‌వి. ఇంత మంచి గౌరవం, స్థానం వదిలేసి త‌న‌ను గుర్తింపు నిచ్చిన పార్టీ పిలవగానే మాట మాట్లాడకుండా, మ‌రేమి ఆలోచించ‌కుండా, షరతులూ లేకుండా గ‌వ‌ర్న‌ర్ ప‌దవిని వ‌దిలేసి పార్టీ ఆదేశానుసారంగా ప‌నిచేస్తాన‌ని చెప్పిన వ్య‌క్తి కుమ్మనం రాజశేఖరన్…

కుమ్మ‌నం రాజ‌శేఖ‌ర‌న్‌ 2017 – 18 లో మిజోరం రాష్ట్ర గవర్నర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న ప‌నిచేసిన ఆ కొద్ది కాలంతో ఆయ‌న జ‌మ‌చేసిన డ‌బ్బులు అదీ కూడా జీతం రూపంలో వ‌చ్చిన‌వి మొత్తం 32 లక్షల రూపాయలు. అయితే ఆయన 2019లో తిరువనంతపురంలో పోటీచేయడానికి నామినేషన్ పత్రాలతోబాటు తనకున్న ఆస్తి గురించిన అఫిడవిట్‌లో బ్యాంక్ ఖాతాలో ఒక లక్ష రూపాయలు, చేతిలో 513 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన 31 లక్షల రూపాయలను ఆయన మిజోరాంలోని అనాథాశ్రమం, మరియు సామాజిక సంస్థలకు దానం చేసి, కట్టుబట్టలతో వచ్చేశారు. బాటనీలో డిగ్రీ, జర్నలిజంలో పోస్టుగ్రాడ్యుయేట్ చ‌దివి, 1976 లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వ‌చ్చిన‌ ఉద్యోగాన్ని వదిలేసి , సమాజసేవ కోసం నిరంత‌రం ప‌నిచేస్తున్న వ్య‌క్తి రాజ‌శేఖ‌ర‌న్‌.. ఫ‌లానా ద‌గ్గ‌ర మీరు పోటీ చేయాలంటే అక్క‌డ గెలుస్తామా, లేదా అని ఆలోచించ‌కుండా ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని వ‌దిలి ఇప్పుడు అతి సామాన్య జీవితాన్ని గ‌డుపుతున్నాడు. ఇలాంటి నాయ‌కులు ఇప్ప‌టి కాలంలో ఎక్క‌డ వెతికినా దొర‌క‌రెమో. ఇలాంటి ఆలోచ‌న‌లు గ‌ల నాయ‌క‌త్వం వ‌స్తేనే దేశం అన్ని రంగాలుగా ముందుకుపోతుంది. కాని ఇలాంటి వారిని ఇప్ప‌టి కాలంలో స్వాగ‌తించేవారు, ఎద‌గ‌నిచ్చే వారు మాత్రం ఎక్క‌డ లేరు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!