Share On

అంద‌రూ ఓటెయ్యాలి.. ప్ర‌తి ఒక్క‌రి ఓటు అత్య‌వ‌స‌ర‌మే అని ప్ర‌భుత్వాలు, స్వ‌చ్చంధ సంస్థ‌లు ప్ర‌చారం చేస్తున్నాయి. ఒక్క ఓటు అభ్య‌ర్థి రాత‌ను మార్చ‌వ‌చ్చు. గెలుపోట‌ముల‌ను త‌ల‌కిందులు చేయ‌వ‌చ్చు. ఇప్పుడు బీహార్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చాలా మంది అభ్య‌ర్థులు అతి త‌క్కువ మెజారిటీతోనే గెలిచారు. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం కేవ‌లం 12 ఓట్ల‌తోనే అభ్య‌ర్థి ఎమ్మెల్యెగా విజ‌యం సాధించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. బీహార్‌లోని హిల్సా నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి కృష్ణమురారీ శరణ్‌ అలియాస్‌ ప్రేమ్‌ ముఖియా తన సమీప ఆర్జేడీ ప్రత్యర్థి అత్రి మునిపై కేవలం 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఫలితాల్లో ప్రేమ్‌ ముఖియాకు 61,848 ఓట్లు రాగా, అత్రి మునికి 61,836 ఓట్లు పోలయ్యాయి. హిల్సా ఫలితంపై ఆర్జేడీ ప‌లు అనుమానాలు వ్యక్తం చేసింది. హిల్సాలో అత్రి ముని 547 ఓట్లతో గెలిచినట్లు తొలుత రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. కాసేపట్లో ధ్రువపత్రం ఇస్తామన్నారు. అయితే అంతలోనే రిటర్నింగ్‌ అధికారికి ముఖ్యమంత్రి నివాసం నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో ఆ అధికారి వెంటనే మాటమార్చారు. పోస్టల్‌ బ్యాలెట్లను రద్దు చేసినందు వల్ల ఆర్జేడీ అభ్యర్థి ఓడిపోయినట్లు మళ్లీ ప్రకటించారని ఆర్జేడీ ట్విటర్‌ వేదికగా ఆరోపించింది. ఆర్జేడీ ఆరోపణలను ఎన్నికల కమిషన్‌ తోసిపుచ్చింది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, పారదర్శకంగానే లెక్కింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. ఏదేమైనా కేవలం 12 ఓట్లతో ఆర్జేడీ ఒక సీటు కోల్పోవాల్సి వచ్చింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!