Share On

మ‌రో ప‌ది రోజుల్లో పెళ్లి.. ఆ జంట ఆనందానికి అవ‌ధులుగా లేకుండా పోయింది.. ఇద్ద‌రు ఒక్క‌టి కాబోతున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్నామ‌ని క‌ల‌లుగ‌న్న ఆ జంట ఆశ‌లు, కోరిక‌లు అన్ని క‌ల‌లుగానే మిగిలిపోయాయి. మైసూరులో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో చేస్తుండ‌గా జరిగిన ప్రమాదం కాబోయే దంపతులను బలి తీసుకుంది. క్యాతమరానహళ్లికి చెందిన చంద్రు(28), శశికళ(20) దూరపు బంధువులు. గతేడాది నవంబరు 22న ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది. ఈ సంవ‌త్సరం అదే న‌వంబ‌ర్ 22న వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేయించుకోవాలని చంద్రు, శశికళ కావేరీ నదీ తీరాన జలధామ రిసార్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో మోటార్‌బోటు ఎక్కిన కాబోయే వధూవరులు, ఇంగ్లీష్‌ సినిమా ‘టైటానిక్‌’ లోని ప్రణయ దృశ్యాలను తలపించేలా ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయారు. చంద్రు, శశికళను కాపాడేందుకు ఫొటోగ్రాఫర్‌ చేసిన ప్రయత్నం విఫలమవ్వడంతో ఇద్దరూ జలసమాధి అయ్యారు. ఈ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఫొటోషూట్‌ కోసం వెళ్లిన సమయంలో శశికళ హైహీల్స్‌ ధరించి ఉన్నారని, ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో అదుపు తప్పడంతో బోటు పక్కకు వంగిందని పేర్కొన్నారు. ఆ వెనువెంటనే ఆమెతో పాటు చంద్రు సైతం నీళ్లల్లో పడిపోయాడని, బోటు నడిపే వ్యక్తి, ఫొటోగ్రాఫర్‌కు ఈత రావడంతో బతికి బయటపడ్డారని తెలిపారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!