Share On

ప్ర‌జ‌ల‌కోసం ప్ర‌భుత్వాలు ప‌నిచేస్తున్నాయంటారు.. ప్ర‌జ‌ల‌కోసం ఖాళీ లేకుండా నాయ‌కులు ఇర‌వై నాలుగు గంట‌లు ఆలోచిస్తూనే ఉంటారంట‌.. అదీ అలా మాట్లాడే వారికి మాత్ర‌మే తెలుసు.. నాయ‌కులు బ‌య‌టికి వెళుతే వారి వెంట తిరిగే వారు, నాయ‌కుల కోసం తిండి, తిప్ప‌ల్లేక బ‌తికే కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి పార్టీలో ఉంటారు. ఎన్నిక‌ల ముందు జెండాలు క‌ట్టేదీ వారే, జైజైలు కొట్టేదీ వారు, గొడ‌వ‌లు, కొట్లాట‌లో ముందుండేదీ వారే.. కాని ప‌ద‌వుల స‌మ‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం ఆ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకునే వారే ఉండ‌రు. ఏదైనా రిజ‌ర్వేష‌న్ వ‌స్తే మాత్రం త‌మ‌కోసం ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌లో మంచివారిని చూసి అవ‌కాశం క‌ల్పిద్దామ‌నే ఆలోచ‌న ఏ కొద్దిమందిలో ఉంటుంది కాని చాలా మందిలో తాము కాకుంటే తమ కుటుంబంలోని ఎవ‌రో ఒక‌రికి అవ‌కాశం కోసం తాప‌త్ర‌య‌ప‌డుతూ వారినే అందలం ఎక్కిస్తారు.. కాని కార్య‌క‌ర్త‌లు మాత్రం ఎప్పటికి కార్య‌క‌ర్త‌లుగానే మిగిలిపోవాల్సిన ప‌రిస్థితి..

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌కు శంఖారావం మోగింది. మేయ‌ర్ మ‌హిళ రిజ‌ర్వేష‌న్ కావ‌డంతో అధికారంలో ఉన్న వాళ్లు, ఇప్ప‌టికే అధికారం అనుభ‌వించిన వాళ్లు న‌గ‌రంలో 24గంట‌లు ప‌నిచేసిన మ‌హిళ‌ల‌ను వ‌దిలేసి, త‌న కొడ‌లుకు ఇవ్వాలి, త‌మ కూతురుకు ఇవ్వాలి, త‌మ మ‌ర‌ద‌లు, త‌మ భార్య అని మాట్లాడుతున్నారే కాని, పార్టీ కోసం ప‌నిచేసిన లేదా తెలంగాణ ఉద్య‌మం కోసం ప‌నిచేసిన ఒక మంచి మ‌హిళ‌ను ఎంపిక చేద్దామ‌నే ఆలోచ‌న ఎందుకు రావ‌డం లేదో అర్థ‌మే కావ‌డం లేదు. ఎంత‌సేప‌టికి తాను లేదా త‌మ కుటుంబం, లేదంటే త‌మ కుటుంబస‌భ్యులు మాత్ర‌మే ప‌దవులు అనుభ‌వించాల‌నే ఆలోచనే మ‌న నాయ‌క‌గ‌ణంలో బ‌లంగా ఉంది.

కార్పోరేట‌ర్ల ఎంపిక‌లో కూడా పార్టీ కోసం ప‌నిచేసిన వారికి అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌మ‌కు న‌చ్చిన వారికే అవ‌కాశం ఇస్తున్నార‌ని కొంద‌రు, సీట్ల‌ను అమ్ముకుంటున్నార‌ని మ‌రికొంద‌రు పార్టీ కార్యాల‌యాల ఎదుట అందోళ‌న‌లు చేస్తూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఐనా అధిప‌త్యం ఆలోచ‌న‌లో ఉన్న నాయ‌క‌త్వం వారు ఎంపిక చేసే విధానం వ‌ల్ల‌నే ఓట‌మి చెందుతున్నార‌ని గ‌తంలో కొన్ని పార్టీల గుణ‌పాఠాల‌ను చూసి నేర్చుకోలేక‌పోతున్నారు. పార్టీనే అంటిపెట్టుకొని ఇరవై నాలుగు గంట‌లు అధికారంలో ఉన్నవారికి అవ‌కాశం క‌ల్పిస్తే మ‌రికొంత‌మంది యువ‌కులు, మ‌హిళ‌లు కొత్త త‌రం నాయ‌క‌త్వం పుట్టుకొచ్చే ప‌రిస్థితి ఉంటుంది. కాని ఎంత‌సేప‌టికి తాను, తన కుటుంబం మాత్ర‌మే అధికారాన్ని అనుభ‌వించాల‌నే ఆలోచ‌న పోయిన‌ప్పుడే అంద‌రికి స‌మాన అవ‌కాశాలు ఉంటాయి. కింది స్థాయిలో ప‌నిచేసే కార్య‌క‌ర్తకు కూడా ఇప్పుడు కాకున్నా, ముందు ముందు త‌న‌కు ఏదో ఒక గుర్తింపు వ‌స్తుంద‌నే ఆలోచ‌న ఉంటుంది. కాని ఎంత‌సేప‌టికి అడుగుల‌కు మ‌డుగులోత్తే వారికి అవ‌కాశం క‌ల్పిస్తూ పోతూ ఉంటే ఇప్పుడు కాకున్నా రాబోయే రోజుల్లోనైనా పార్టీ మ‌నుగడ ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయే అవ‌కాశం ఉంటుంది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *