Share On

క‌రోనా అమెరికాలో ఉగ్రరూపం దాల్చింది.. నిమిషానికి ఒక‌రు వైర‌స్ సోకి మ‌ర‌ణిస్తున్నార‌ని చెపుతోంది. బుధ‌వారం నాటికి 2.5లక్ష‌ల మందికి పైగా అమెరిక‌న్ల‌ను క‌రోనా బ‌లితీసుకుంది. ప్ర‌స్తుతం అమెరికాలో 1.15కోట్ల‌కు పైగా క‌రోనా కేసులున్నాయి. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో క‌రోనా బాధితులు వ‌స్తుండ‌డంతో అక్క‌డి ఆసుప‌త్రుల‌న్నీ కిట‌కిట‌లాడుతున్నాయి. ప‌డ‌క‌లు లేక‌, ప్రార్థ‌నా మందిరాలు, హోట‌ళ్లు, పంక్ష‌న్‌హాల్స్‌, పార్కింగ్ ప్ర‌దేశాల‌ను క‌రోనా ఆసుప‌త్రులుగా మార్చుతున్నారు. స‌రిప‌డినంత వైద్య సిబ్బంది లేక బాధితులు అవస్థపడుతున్నారు. రెండు, మూడు వారాల క్రితం రోజుకు 70-80 వేల కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ బుధవారం ఒక్కరోజే 1.55 లక్షలకుపైగా నమోదయ్యాయని జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు డా.జొనాథన్‌ రీనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా 24 గంటల్లో 1700 మరణాలు సంభవిస్తే, రెండు నుంచి మూడు వారాలు గడిచేటప్పటికి రోజుకు సుమారు 3 వేల మంది మృతిచెందవచ్చని అంచనా వేశారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 13 లక్షల మందికి పైగా మృతి చెందారు.

జపాన్‌లో గురువారం 2,179 కరోనా కేసులు వచ్చాయి. ఒకే రోజు 2 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఆఫ్రికాలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ ఖండంలోని 54 దేశాల్లో 48 వేల మందికి పైగా కొవిడ్‌తో మరణించారు. పాకిస్థాన్‌లో గురువారం 2547 కొత్త కేసులు వెలుగుచూడగా, 18 మంది మరణించారు. గల్ఫ్‌ దేశాలకు కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారంలో కొత్తగా నమోదైన కేసుల్లో 60 శాతానికి పైగా ఇరాన్‌లోనే వెలుగుచూసినట్లు తెలిపింది. జోర్టాన్, మొరాకో, లెబనాన్, ట్యునీసియాల్లోనూ ఒకే రోజు సంభవించిన మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొంది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!