Share On

పిల్ల‌లు ఎదుగుతున్నారు.. పెద్ద‌వాళ్లు అవుతున్నారు.. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది వారి ఆలోచ‌న విధానం కూడా మారిపోతుంది.. వారేమి ఆలోచిస్తున్నారో, ఎవ‌రితో స్నేహం చేస్తున్నారో త‌ల్లిదండ్రులే ప‌ట్టించుకోవ‌డం లేదు.. ఎవ‌రి బిజీ జీవితంలో వారే త‌ల‌మున‌క‌లైపోతున్నారు. అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా మారిపోయిన విజ‌య‌వాడ నగ‌రంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగిపోతుంది. బెజవాడ యువకుల గ్యాంగ్ వార్‌ మరువక ముందే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయి తాగుతూ 55 మంది విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. విజయవాడలో అతి చిన్న వయసులోనే పిల్లలు గంజాయికి అలవాటు పడుతూ, టెన్త్, ఇంటర్, బీటెక్ చదివే విద్యార్థులు ఎక్కువగా ఈ గంజాయి మహమ్మారికి బానిసలవుతున్నారు. గంజాయి రవాణా, వాడ‌కంపై పక్కా సమాచారం అంద‌డంతో వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బెజవాడలో టెన్త్ నుంచి బీటెక్ వరకు విద్యార్థులు గంజాయి మత్తులో మునిగితేలుతున్నట్లు గుర్తించారు. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 2 రోజుల్లో దాదాపు 55 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 12 మంది బీటెక్, 20 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులు, కొందరు టెన్త్ విద్యార్థులు ఉన్నారు. వీరు విజయవాడలోని ప్రముఖ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. అస‌లు గంజాయి ఎక్క‌డ నుంచి ర‌వాణా అవుతోంది, దాని వెనుకాల ఉన్న‌దీ ఎవ‌రనేదీ తెల్చే ప‌నిలో పోలీసులు ఉన్నారు. ఎదుగుతున్న వ‌య‌స్సులో పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటు ప‌డుతూ నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఇలాంటి వాటిని ఎవ‌రూ ఉపేక్షించ‌వ‌ద్ద‌ని పోలీసు అధికారులు అంటున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!