తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నాన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా చక్రస్నానాన్ని నిర్వహించడం ఆనవాయితీగా రావడంతో, కోవిడ్ నిబంధనల కారణంగా భక్తులను అనుమతించలేదు. వేకువజామున చక్రతాళ్వార్ను ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణికి తీసుకెళ్లి, అక్కడ చక్రతాళ్వార్కి తిరుమంజనం నిర్వహించారు అర్చకులు. అనంతరం కర్పూర నీరాజనాలు అందించి, పుష్కరిణి చక్రతాళ్వార్కి స్నానమాచరింపు చేశారు. చక్రస్నానంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డిలతో పాటు అర్చకులు పాల్గొన్నారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా ఏకాంతంగా చక్రస్నానాన్ని నిర్వహించారు. ద్వాదశి పర్వదినాన తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శనంలో సూప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందిర బెనర్జీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు, మాజీ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎల్.నరసింహరెడ్డి, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు.