దేనికైనా సమయం రావాలంటారు.. అందుకే దాదాపుగా అందరూ సమయం కోసం వేచిచూస్తూ ఉంటారు. ఉద్యోగం రావాలన్నా, పెళ్లి కావాలన్నా సమయం వచ్చినప్పుడే అవుతుందని నమ్మేవారు చాలామందే ఉంటారు. కాని ఒక జంటకి మాత్రం పెళ్లి గడియలు దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ పెళ్లి ఆగిపోవడానికి ప్రధాన కారణం ప్రకృతి సహకరించకపోవడమే.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన ప్రేమచంద్రన్, సంద్రా సంతోష్ వీళ్లిద్దరికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. మొదటి సారి 2018 మే 20న పెళ్లికి తేదీ ఫిక్స్ చేశారు. సరిగ్గా అప్పుడే కేరళలో నిఫా వైరస్ విజృంభించింది. నిఫా వైరస్ ప్రభలడంతో కోజికోడ్, మలప్పురం జిల్లాలో 17 మంది చనిపోయారు. దాంతో ఈ వైరస్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా జన సమూహలపై ఆంక్షలు విధించారు. సామాజిక దూరం పాటించాలని, రాకపోకలు ఆపుచేయాలని ఆదేశించారు. అంతే పెళ్ళి వాయిదా పడింది. నిఫా వైరస్ నుండి కోలుకుంటూ మళ్లీ కేరళలో వాతావరణం కుదుటపడటంతో మళ్లీ ప్రేమ చంద్రన్, సంద్రాలు కూడి పెళ్లి చేసుకోవాలన్నారు . కాని ప్రేమచంద్రన్ వాళ్ల బంధువులు చనిపోవడంతో మళ్లీ పెళ్లి ఒక్క సంవత్సరం వాయిదా వేశారు. మళ్లీ 2019 ఓనం సెలవుల్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ సారి వరదల రూపంలో ప్రకృతి వీరి పెళ్లికి అడ్డుపడింది. అయినా సరే ఆశ వదులు కోకుండా మార్చి 22,2020 పెళ్లికి సిద్దపడ్డారు. ఈ సారి కరోనా రూపంలో పెళ్లి వాయిదా పడింది. మార్చ్ లో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందేగా. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని , పెళ్లిల్లు, మీటింగులు అన్ని వాయిదా వేశారు. అసలు వీరి పెళ్లి ఇంకెప్పుడు జరుగుతుందో అని బంధుమిత్రులందరూ ఎదురుచూస్తూ ఉన్నారు.