మాల పల్లె, మాదిగ పల్లె, హరిజన వాడ, గిరిజన వాడ, దళితవాడ వంటి కులాలను సూచించే పేర్లను మార్చేయాలని, వాటి స్థానంలో మహానీయులు, మహానుభావుల పేర్లను పెట్టాలని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో అమలు చేశారు. దేశంలో తొలిసారిగా అనంతపురం జిల్లాలో కులాలను సూచించేలా ఉన్న కాలనీల పేర్లు మార్పు ద్వారా కలెక్టర్ గంధం చంద్రుడు సామాజిక విప్లవం ప్రారంభించారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 480 కాలనీల పేర్లు మార్పునకు శ్రీకారం చుట్టారు. మాల పల్లె, మాదిగ పల్లె, ఇలా కులాల పేర్లతో ఉన్న కాలనీల పేర్లు మారుస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో గత నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ రాష్ట్రంలో కూడా కులాల పేరుతో ఉన్న కాలనీల పేర్లు తొలగించాలని స్పష్టం చేసింది. అనంతపురం జిల్లాలో ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, చాకలి వీధి, ఇలా అనేక రకాలుగా కులాల పేర్లతో ఉన్న ఆయా కాలనీలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గౌతమ బుద్ధ, జగ్జీవన్ రామ్, ఇందిరమ్మ, గాంధీ, నెహ్రూ, నేతాజీ, వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, మదర్ థెరిస్సా ఇలా స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, మహానుభావుల పేర్లు పెట్టారు.
ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 390 ఎస్సీ కాలనీలకు పేర్లు మార్చినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. 203 ఎస్సీ కాలనీలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టుకున్నారని వివరించారు. అలాగే 39 కాలనీలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) పేరు లేదా ఆ ట్రస్ట్ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్, ఆయన కుమారుడు మాంచో ఫెర్రర్ పేర్లు పెట్టుకున్నట్లు వివరించారు.