కర్ణాటక రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడ తనకు జరిగినా అవమానం భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చిక్కమంగళూరు వద్ద రైల్వే ట్రాక్ పక్కన ధర్మగౌడ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్‌తో పాటు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న సాయంత్రం కారులో ఇంటి నుంచి ఒంటరిగా ధర్మగౌడ బయల్దేరారు. రాత్రికి తిరిగి రాకపోవడంతో అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంతా పోలీసులు ధర్మగౌడ ఆచూకీ కోసం గాలించగా, మంగళవారం ఉదయం చిక్కమంగళూరు రైల్వేట్రాక్ వద్ద ఆయన మృతదేహం లభించింది. జేడీఎస్ నుంచి ధర్మగౌడ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
కర్ణాటక శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యులు పరస్పరం తన్నుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుడైన చైర్మన్‌పై అధికార బీజేపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై చర్చ సందర్భంగా సభ్యులంతా స్థాయి మరిచి ప్రవర్తించారు. పరస్పరం తోసుకోవటంతో ఆగకుండా ముష్ఠిఘాతాలు కురిపించుకున్నారు. సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న జేడీఎస్ సభ్యుడైన డిఫ్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మగౌడను కాంగ్రెస్ సభ్యులు కిందికి లాగిపడేశారు. సభాధ్యక్ష కుర్చీ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. ఒక కాంగ్రెస్ సభ్యుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు. దాంతో ఆ కుర్చీని స్వాధీనం చేసుకొనేందుకు బీజేపీ, జేడీఎస్ సభ్యులు ప్రయత్నించటంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అడ్డువచ్చిన మార్షల్స్‌పైనా పిడిగుద్దులు కురిపించారు. ఆ అవమానం భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.