కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి పార్టీ పెట్టట్లేదని తలైవా ట్విటర్ వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖ విడుదల చేశారు. ‘రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా. కానీ ఇప్పుడు కాదు. అనారోగ్య కారణాల దృష్ట్యా నూతన పార్టీ ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నానని రజనీ తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల రజనీ హైదరాబాద్ సినిమా షూటింగ్లో అనారోగ్యానికి గురైన విషయం అందరికి తెలిసిందే. అధిక రక్తపోటు కారణంగా హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చేరిన తలైవా రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. గత శనివారం చెన్నై చేరుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలని కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు చేసిన విజ్ఞప్తి మేరకు కొన్ని రోజులు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి మాత్రం తప్పకుండా వస్తానని, తాత్కాలికంగానే విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. రజనీకాంత్ రాజకీయ విరమణ ప్రకటనపై అభిమానులు ఏలా స్పందిస్తారో చూడాల్సిందే.