మందు లేనిదే ఏ పార్టీ జరుగదు.. ఏ కార్యక్రమం ముందుకు నడవదు.. తెలంగాణలో మందుకు ఉన్న విలువ మరేదానికి లేదనే చెప్పవచ్చు. రాష్ట్రంలో నూతన సంవత్సర పార్టీలకు అనుమతి లేకపోయినా మద్యం అమ్మకాలు మాత్రం జోరుగా సాగాయి. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఇంచుమించుగా రూ.759 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఆబ్కారీ లెక్కల ద్వారా తెలిపింది. 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీరు కేసులు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు రూ.200 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. డిసెంబర్ 28వ తేదీన రూ.205.18 కోట్లు, 29న రూ.150 కోట్లు, 30న 211.35 కోట్లు, 31వ తేదీన రూ.193 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఉమ్మడి జిల్లాల వారీగా కరీంనగర్ జిల్లాలో రూ.50.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 52.70 కోట్లు, మహబూబ్నగర్లో రూ.47.78 కోట్లు, మెదక్లో రూ.53.87 కోట్లు, నల్గొండలో రూ.75.98 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.37.5 కోట్లు, వరంగల్లో రూ.63.49 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకలకు అనుమతించకపోయినా గతేదాడి కంటే ఈసారి మద్యం విక్రయాలు భారీగానే జరిగినట్లు పేర్కొంటున్నాయి.