రామతీర్థం.. ఇప్పుడు ఆంధ్రాలో అదొక రణరంగంగా మారిపోయింది. ఒకే రోజు, ఇంచుమించు ఒకే సమయానికి తెదేపా, భాజపా, వైకాపా నేతల రామతీర్థం పర్యటించారు. వైకాపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం ఆలయాన్ని సందర్శించగా, ఆయనతో పాటు భాజపా ఎమ్మెల్సీ మాధవ్ కూడా అక్కడికి చేరుకోగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన కూడా ఉండటంతో మూడు పార్టీల కార్యకర్తల పోటా పోటీ ఆందోళనలు, నిరసనలతో రామతీర్థం అట్టుడికింది.
కొండపైకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతిలేదని చెప్పిన పోలీసులు విజయసాయిరెడ్డిని అనుమతించడంతో భాజపా శ్రేణులు భగ్గుమన్నాయి. తమను కూడా బోడికొండపైకి అనుమతించాల్సిందేనని ఎమ్మెల్సీ మాధవ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకవైపు భాజపా నేతల ఆందోళన కొనసాగుతుండగానే విజయసాయిరెడ్డితో పాటు భారీగా వైకాపా నాయకులు కొండపైకి నడుచుకుంటూ వెళ్లి కోదండరాముడి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కొండదిగి కిందకు వస్తున్న క్రమంలో విజయసాయిరెడ్డి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. వైకాపా, తెదేపా, భాజపా శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేయడంతో రామతీర్థం రణరంగంగా మారింది. మూడు పార్టీల కార్యకర్తలు తోపులాటకు దిగారు. భాజపా శిబిరం వద్ద జరిగిన తోపులాటలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని సొమ్మసిల్లి పడిపోయారు. విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేక పోయిన నేతలు పర్యటనకు ఎందుకొచ్చారని విపక్షాలతో పాటు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య విజయసాయిరెడ్డి పర్యటన సాగింది. బోడికొండ దిగువున వైకాపా, తెదేపా, భాజపా శ్రేణులు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఆందోళనకు దిగారు. మరో వైపు విశాఖ నుంచి రోడ్డు మార్గంలో రామతీర్థం బయల్దేరిన చంద్రబాబు కాన్వాయ్‌కు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెదేపా నేతలు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి రామతీర్థంలో ఉండగానే చంద్రబాబు కాన్వాయ్ కూడా అక్కడికి చేరుకుంది. దీంతో చంద్రబాబు కాన్వాయ్ మరో మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. చంద్రబాబు రామతీర్థం చేరుకోగానే తెదేపా శ్రేణులు జై శ్రీరామ్, జై తెలుగుదేశం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.