Share On

ఎముక‌ల కొరికే చ‌లిలో మ‌న జ‌వానులు ఎంతోమంది నిత్యం మ‌న‌కోసం పనిచేస్తూ ఉంటారు. వారి ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి మ‌న ప్రాణాల‌ను కాపాడుతారు. ఈ సీజ‌న్‌లో చ‌లి మ‌రీ తీవ్రంగా ఉంది. మ‌నం నివ‌సించే ప్రాంతాల్లోనే చ‌లి ఇలా ఉంటే ఇంకా దేశ స‌రిహ‌ద్దులో ఏలా ఉంటుందో అర్థం కాని ప‌రిస్థితి. జ‌మ్మూ క‌శ్మీర్‌లో ఎముక‌లు కొరికే చలిలో ఆర్మీ జ‌వానుగా విధులు నిర్వ‌హిస్తున్న రెడ్డ‌ప్ప‌నాయుడు చ‌ల్ల‌టి గాలుల తాకిడికి త‌ట్టుకోలేక అమ‌రుడ‌య్యాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు (38) గత 14 ఏళ్లుగా భారత సైనిక దళంలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విధుల్లో భాగంగా సరిహద్దుల్లో శనివారం పహారా కాస్తుండగా చలి తీవ్రత ఎక్కువ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సహచర జవానులు గుర్తించి సపర్యలు చేసి వెంటనే హెలికాఫ్టర్‌లో ఆర్మీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కాని రెడ్డప్పనాయుడు అప్ప‌టికే మృతి చెందాడని ఆర్మీ వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఈ విషయాన్ని జవాను కుటుంబీకులకు చేరవేశారు. రెడ్డప్ప నాయుడు మరణ వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. రెడ్డప్ప నాయుడుకు భార్య రెడ్డమ్మ, కుమారుడు సాత్విక్ కుమార్తె నిశిత ఉన్నారు.

14 ఏళ్లుగా ఆర్మీలో సేవలందించినందుకు గాను రెడ్డప్ప నాయుడుకు ఇటీవల పదోన్నతి (ప్రమోషన్) లభించింది. దీంతో కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందపడ్డారు. సంక్రాంతి పండక్కి సెలవుపై ఇంటికి వస్తానని రెడ్డప్ప నాయుడు తల్లిదండ్రులకు కూడా చెప్పారు. అయితే సంక్రాంతికి వస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా మారాడని తెలుసుకున్న తల్లిదండ్రులు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెడ్డప్ప మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెడ్డప్ప భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!