తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి అనుకోకుండా హఠాత్తుగా ఒక స్వామీజీ ప్రవేశించి ఆశీర్వచనాలు అందించి వెళ్లారు. స్వామీజీ హఠాత్తుగా ఎందుకు వచ్చాడో మాత్రం సమాచారం లేదు. ఆ స్వామీజీ పేరు నమోనారాయణస్వామి. రజనీకాంత్ రాజకీయ పార్టీ లేదని ప్రకటన ఇచ్చిన తర్వాత రజనీ పోయెస్‌గార్డెన్‌లోని తన ఇంటికే పరిమితం అయ్యారు. అపోలో వైద్యుల సూచన మేరకు ఆయన పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. అతనిని కలిసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఈ పరిస్థితుల్లో శనివారం నమో నారాయణస్వామి రజనీ ఇంటికి వెళ్లారు. ఆయన్ను రజనీకాంత్, లతారజనీకాంత్ ఆహ్వానించారు. రజనీ, స్వామీజీ అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. రజనీకి స్వామిజీ ఆశీస్సులు అందించి వెళ్లారు. ఇంటి నుంచి బయటకు వచ్చి స్వామీజీకి వీడ్కోలు పలికారు. రజనీని పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని మక్కల్ మండ్రం వర్గాలు పేర్కొన్నాయి. స్వామీజీ వచ్చి వెళ్లడం, ఇందుకు తగ్గ ఫొటోలు బయటకు రావడం గమనార్హం.