ఏ దేశంలోనైనా మనిషి ఆయుర్థాయం ఎంత ఉంటుంది 70 లేదా 80 సంవత్సరాలు.. మారుతున్న సమాజాన్ని బట్టి, సమాజంలో మనిషి జీవితాన్ని బట్టి కొన్ని దేశాల్లో ఆయుర్ధాయం ఉంటుంది. కాని కొన్ని ప్రాంతాల్లో అదీ కూడా సమాజానికి దూరంగా ఉంటున్న కొన్ని తెగల్లో వారి జీవన విధానాన్ని బట్టి వారి జీవితకాలం పెరుగుతూ ఉంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని గిల్గిట్-బల్టిస్తాన్ పర్వతాల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ చేరువలో ఒక తెగ నివాసం ఉంటుంది. ఆ తెగనే హుంజా తెగ. ఈ తెగ వారు నివసించే గ్రామాన్ని ఒయాసిస్ ఆఫ్ యూత్ అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి ప్రజల సగటు ఆయుర్దాయం 110 నుంచి 120 ఏళ్లుగా ఉంది. వీరి వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ యవ్వనంగానే కనిపిస్తారు. అంతేకాకుండా ఈ తెగలోని మహిళలు 65 ఏళ్ల వయస్సులోనూ పిల్లల్ని కంటారని చెపుతున్నారు.
హుంజా గ్రామస్థులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కువగా నివాసం ఉంటారు. ఇండియా, పాకిస్థాన్, చైనా, ఆఫ్గనిస్థాన్ సరిహద్దులు కలిసే చోట ఉంటారు. ఈ తెగకు చెందిన ప్రజల జనాభా సుమారుగా 87వేలుగా ఉంది. వీరు తాము పాటించే జీవనవిధానం వల్లనే 100 ఏళ్లకు పైగా జీవిస్తున్నారు. గతంలో వీరి ఆయుర్దాయం 165 ఏళ్లుగా ఉండేదట. ఇక వీరికి అనారోగ్య సమస్యలు అంటే కూడా దాదాపుగా తెలియవనే చెపుతారు. వీరు చాలా తక్కువగా అనారోగ్యం బారిన పడుతుంటారు. అలాగే ట్యూమర్ల వంటి వ్యాధులు వీరికి ఇప్పటి వరకు రాలేదు.
ఈ తెగలోని వీరు ఎక్కువగా తేనెను వాడుతారు. 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత కలిగిన చల్లని నీటితో వీరు స్నానం చేస్తారు. వీరు తాము పండించే బార్లీ, మిల్లెట్స్, యాప్రికాట్స్, నట్స్, ఇతర కూరగాయాలు, ధాన్యాలను ఎక్కువగా తింటారు. నిత్యం కాలి నడకనే సుమారుగా 15 నుంచి 20 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తారు. అందువల్లే వీరు ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. ఎప్పుడు నవ్వుతూ ఉండటమే వీరు ప్రధాన బలం.