ఆ అడవులు అంటేనే ప్రతి ఒక్కరికి వణుకు, ఆ అడవిలో ఎక్కడ ఏముందో, ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటీ కీకాకరణ్యంలో అక్కడక్కడ ఆ పరమ శివుడి ఆలయాలు ఉంటాయి. కాని సంవత్సరంలో కేవలం ఐదు అంటే ఐదు రోజులు మాత్రమే తెరిచే ఉండే ఆలయం ఆ అడవుల్లో ఉంది. అక్కడికి వెళ్లడం, ఆ దేవుడిని దర్శించుకోవడం అంటే ఆషామాషీ కాదు. గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే. అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఒక సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు. గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి. అదే నల్లమల్ల అడవుల్లో ఉన్న సలేశ్వరం ఆలయం.
కర్నూలు జిల్లా శ్రీశైలం దగ్గర్లో ఉన్న ఆలయమే సలేశ్వర ఆలయం. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఐదు రోజులు జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలవుతుంది. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. దట్టమైన అడవిలో నుంచి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. అక్కడి నుంచి 5 లేదా 10 కిలోమీటర్లు కాలినడక. అదీ కూడా అడుగు తీసి అడుగు వేసే అంత దారిలోనే ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. వేయి సంవత్సరాల ఆ గుడిలో ప్రతిదీ ఒక మిస్టరీగానే, ఎవ్వరూ ఊహించని వింతగానే కనబడుతోంది.
తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవున్న సలేశ్వర క్షేత్రం వెళ్ళాలంటే ఎవరికైనా ఒణుకు పుట్టాల్సిందే. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ రాయి దగ్గర పరహాబాద్ గేటు వుంటుంది. అక్కడినుంచి 32కిమీ ల దూరం దట్టమైన అడవిలో వెళ్ళాలంటే ముందుగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి తీసుకోవాల్సిందే. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. స్థానిక చెంచులు ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తారు. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి. 10కి.మీ లు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిధిలావస్థలో వున్న భవనాలు కనిపిస్తాయి. నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై వందేళ్ళకు పూర్వమే అక్కడ వేసవి విడిది నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశాన్ని పరహాబాద్ అంటారు. ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973 లో కేంద్రప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది. అక్కడ నుంచి సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి.
ఇరుకైన లోయల్లో కేవలం కాలు మాత్రమే పట్టే దారి మాత్రమే వుంటుంది. పొరపాటున అక్కడ కాలు జారితే కనీసం శవం కూడా దొరికే పరిస్థితి వుండదు. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగామయ స్వామి, లుగ్దీ మల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలుసు. కాని ఐదో లింగం నల్లమల అడవులలో ఎక్కడ వుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఈ సలేశ్వర ఆలయాన్ని 6వశతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. అక్కడ వెళ్లడానికి సిద్దపడే వారికి ముందే అన్ని జాగ్రత్తలు చెపుతారు. వాటికి ఒప్పుకుంటేనే ఆ దేవాలయం తెరిచిన రోజుల్లో, జాతర జరుగుతున్న రోజుల్లో అక్కడి పరిస్థితిని బట్టి ఆ దేవాలయానికి వెళ్లేందుకు అనుమతిస్తారు.