సోనూసూద్ అంటేనే ఒక మానవతామూర్తి, ఒక దేవుడిగా కొలుస్తున్నారు.. ఆపద ఉందని చెపుతే చాలు, వెంటనే తనకు తోచిన సాయం చేస్తూ ఎంతోమందికి భరోసా నిస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతోమంది పేదలను, వలస కార్మికులను అదుకున్న సోనూసూద్ మరోసారి ఒక మహిళ శస్త్రచికిత్సకు ఆర్థికసాయం చేసి అండగా నిలిచారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన బానోత్ కరుణ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో హన్మకొండలోని ఒక ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు చేసిన అనంతరం వైద్యులు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, రూ.42 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. కరుణకు సాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు సోనుసూద్‌కు ట్విట్టర్ ద్వారా వేడుకోవడంతో వెంటనే స్పందించిన సోనుసూద్ రూ.19,000 ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతోపాటు డాక్టర్‌ను ట్విట్టర్ ద్వారా సంప్రదించడంతో మిగతా డబ్బులు రూ.23 వేలను డాక్టర్ హరికిశోర్ భరించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా కరుణ కుటుంబసభ్యులు సోనుసూద్తోపాటు డాక్టర్ హరికిశోర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఆదుకుంటూ ఎంతోమందికి సాయం చేస్తున్న సోనూసూద్ కోట్లాదిమందికి రియల్ హీరోగా మారిపోయారు.