Share On

సోష‌ల్ మీడియా పెరుగుతున్న కొద్ది వివిధ ర‌కాలుగా మోసం చేసే సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. త‌మ సంస్థ‌ల్లో పెట్టుబ‌డి పెడితే కొన్ని రోజుల్లోనే అంత‌కు రెట్టింపు చేస్తామ‌ని నిజామాబాద్ జిల్లాలోని నలుగురు వ్య‌క్తులు ప‌లువురిని న‌మ్మించి కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి ప‌రార‌య్యారు. ఈ మోసపోయిన బాధితులు జిల్లా అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. చిట్టోజి రాజేశ్, తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్‌ అనే వ్యక్తులు ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ అనేక మంది యువకులను కలుసుకున్నారు. తాము చైన్‌ స్కీమ్, ఈగల్‌ బిట్‌ కాయిన్, యాడ్స్‌ స్టూడియో, వరల్డ్‌ డిజిటల్‌ గోల్డ్‌ కాయిన్‌.. పేర్లతో సంస్థలు నిర్వహిస్తున్నామని, అందులో పెట్టుబడులు పెడితే రెట్టింపు చేస్తామని నమ్మించారు. మరికొంత మందిని చేరిస్తే కమిషన్ కూడా ఇస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మిన ఆర్మూర్, నందిపేట్, నిజామాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన యువకులు ఒక్కొక్కరు రూ.63వేల చొప్పున ఆన్‌లైన్లో చెల్లించారు.

పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చాయంటూ రాజేశ్‌ బృందం ప్రతినెలా రూ.5 వేల చొప్పున మూడు, నాలుగు నెలలు వారికి డబ్బులు తిరిగి చెల్లించారు. డబ్బులు బాగా వస్తున్నాయన్న ఆశతో ఆ యువకులు తమ స్నేహితులు, బంధువులు, స్థానికులను ఒప్పించి స్కీమ్‌లో చేర్పించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 450 మంది సభ్యులుగా చేరి రూ.25కోట్ల వరకు డబ్బులు చెల్లించారు. అప్పటి నుంచి తాటి గంగయ్య, వెంకటేశ్, పుప్పాల శ్రీనివాస్, చిట్టోజి రాజేశ్‌‌లు కనిపించకుండా పోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వస్తుండటంతో బాధితులు మోసపోయామని గ్రహించారు. దీంతో వారంతా సోమవారం నిజామాబాద్ ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!