ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో సోనూసూద్‌ను మించిన వారు ఎవరూ లేరు.. ఆపద ఉందని సమాచారం తెలిస్తే చాలు వెంటనే నేనున్నానంటూ సాయం చేస్తున్న మనిషి సోనూసూద్. ఒక చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సాయం చేసి వారి పాలిట దేవుడిగా నిలిచాడు. కృష్ణాజిల్లా తిరువూరు మండలం మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులకు 15 నెలల వయసున్న కుమార్తె వర్షిత గుండె సమస్యతో బాధపడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కుమార్తెకు చికిత్స చేయించలేని పరిస్థితుల్లో ఆ దంపతులు ఉన్నారు.
ఈ క్రమంలోనే దాతల సాయం తీసుకోవాలని యోచిస్తున్నారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఎం. హరికృష్ణ, ఎల్. గంగాధర్, కె.పాపారావు, డి.సుదర్శన్, ఎం.రాంప్రదీప్ సోషల్ మీడియా ద్వారా చిన్నారి పరిస్థితిని సోనూసూద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తక్షణం స్పందించి చిన్నారికి ఆపరేషన్ నిమిత్తం అయ్యే ఖర్చును సమకూర్చారు. ముంబయి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన రూ.4.50 లక్షల సాయం అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి సోమవారం మునుకుళ్ల చేరుకుంది. తమ బిడ్డకు ప్రాణం దానం పెట్టిన సోనూసూద్‌కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.