మహిళలపై అత్యంత దారుణమైన అమానుషాలు ఆగడం లేదు.. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమందికి శిక్షలు పడినా అత్యాచారాలు, లైంగిక వేధింపులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో హాథ్రాస్ సంఘటన మరువకముందే సభ్యసమాజం తలదించుకునే సంఘటన జరిగింది. గుడికెళ్లిన ఒక 50సంవత్సరాల మహిళపై ముగ్గురు కిరాతకులు దారుణానికి ఒడిగట్టారు. కామవాంఛతో సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు తీవ్రంగా దాడి చేశారు. కాలు, పక్కటెముకలు విరగ్గొట్టి, మర్మాంగాల్లో గాయాలు చేసి అత్యంత దారుణంగా చంపేశారు. ఈ అనాగరిక చర్యకు ఒడిగట్టినవారిలో గుడి అర్చకుడు కూడా ఉన్నాడు. మానవత్వానికే మచ్చలాంటి ఈ ఉదంతం ఎనిమిదేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటనను గుర్తుకు తెస్తోంది. బదాయూ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఈ అకృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ సహాయకురాలిగా పనిచేస్తున్న బాధితురాలు ఆదివారం సాయంత్రం పూజ కోసం గుడికి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో అర్చకుడు, తన ఇద్దరు అనుచరులతో కలసి బాధితురాలి మృతదేహాన్ని ఆమె ఇంటికి తీసుకొచ్చారు. ఆమె గుడి పరిసరాల్లో ఉన్న నీళ్లులేని బావిలో పడిపోయి మరణించారని ఆమె కుమారుడితో చెప్పి వెళ్లిపోయారు. సోమవారం పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం చేయగా బాధితురాలిపై జరిగిన అకృత్యం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసి అర్చకుడి ఇద్దరు అనుచరులను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. అర్చకుడు పరారీలో ఉన్నాడు. కాగా ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉఘయిటి పోలీస్ స్టేషన్ అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ అమానుష ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. ఈ హత్యాచార ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.