పట్టపగలే దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో దొంగలు రెచ్చిపోయారు. బంగారు కొనుగోలు చేసే కస్టమర్లాగ వచ్చి నగల దుకాణానికి వెళ్లి తుపాకులతో బెదిరించి భారీ చోరికి పాల్పడ్డారు. ఐదంటే ఐదు నిమిషాల్లోనే షాపులో ఉన్న నగలన్నీ ఎత్తుకొని పారిపోయారు.
పోలీసులు సమాచారం ప్రకారం మీరా రోడ్డులోని శాంతినగర్ ప్రాంతంలోని ఎస్ కుమార్ జువెల్లరీ దుకాణానికి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు నగలు కొంటామంటూ వచ్చారు. దుకాణంలో ఉన్న నగలు చూపించమని అడిగారు. సేల్స్ సిబ్బంది నగలను బయటకు తీసిన వెంటనే దుండగుల్లో ఒకడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో సిబ్బంది, ఇతర కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే ఆభరణాలను తీసుకుని దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. కేవలం అయిదే నిమిషాల్లో దుండగులు చోరీ చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే దొంగలు ఎత్తుకెళ్లిన నగల విలువ ఎంత అనేది పోలీసులు వెల్లడించలేదు.