Share On

క‌న్న‌పిల్ల‌ల‌ను కంటికి రెప్ప‌లా పెంచుతూ, ప్ర‌యోజ‌కులుగా మార్చుతే, కొడుకులు పెద్ద‌య్యాక త‌మ దారి త‌మ‌దంటూ వృద్దాప్యంలో ఉన్న త‌ల్లిదండ్రులను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేస్తున్నారు. ఒక వృద్దుడి బాధ చూస్తే మాత్రం క‌డుపు త‌రుక్క‌పోతుంది. ఐదెక‌రాలు సంపాదించి, ఐదుగురు పిల్ల‌ల‌ను పెంచి పెద్ద చేసి వృద్దిలోకి తీసుకొస్తే క‌నీసం పిడికెడు మెతుకులు కూడా పెట్ట‌లేక‌పోవ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఆ పెద్ద మ‌నిషి ఉన్నాడు. తిండికి అల్లాడుతున్న 85 సంవ‌త్స‌రాల వృద్దుడిని గుర్తించి స్థానిక పోలీసులు ప‌ట్టెడ‌న్నం పెట్టించారు.

కరీంనగర్ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెందిన అల్లాడి ముకుందరావు(85)కు అయిదుగురు సంతానం. ఐదెకరాల వ్యవసాయ భూమిని విక్రయించి ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశాడు. ఇద్దరిలో ఒక కూతురు అనారోగ్యంతో మరణించింది. కొద్ది రోజుల క్రితం భార్య కూడా మరణించడంతో పెద్ద కుమారుడి వద్ద ఉంటున్నాడు. ఆర్టీసీ బస్ డ్రైవర్ ఉద్యోగం చేస్తున్న పెద్ద కుమారుడు తన కుటుంబాన్ని పోషించుకోవడమే తనకు కష్టంగా ఉందని, తమ్ముళ్ల దగ్గరకు వెళ్లమంటూ తండ్రిని పంపించాడు. వాళ్లిద్దరు కూడా తండ్రిని భారంగానే భావించి, మేము కూడా చూడ‌మ‌ని, త‌మ వ‌ల్ల కాద‌ని చెప్పారు. దాంతో మూడు రోజులుగా తినడానికి తిండి లేక ఆకలితో అలమటించి చివరకు గురువారం రోజు పోలీస్ స్టేషన్‌‌కు చేరుకున్నాడు. అయిన వాళ్లు ఉన్నా అన్నం పెట్టే వారు కరువయ్యారని ఆవేదన చెందాడు. ఆకలిగా ఉందనడంతో పోలీస్ కానిస్టేబుల్ రాజేందర్, హోంగార్డు వెంకటేశ్వర్లు భోజనం తెప్పించి పెట్టారు. కడుపు నిండా అన్నం పెట్టిన పోలీసులకు ఆ వృద్ధుడు చేతులెత్తి నమస్కరించాడు. వృద్ధాప్యంలో ఆయన పడుతున్న బాధను చూసి, కొడుకులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని పోలీసులు అతడికి భరోసా ఇచ్చారు. అప్ప‌టివ‌ర‌కు స్టేషన్‌లోనే ఉండమంటూ ఆశ్రయమిచ్చారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!