కరోనా నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధులకు, సిబ్బందికి మొదటగా కరోనా టీకాలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. అందుకు 3కోట్ల మందికి తొలి టీకా ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాబోతోంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత, వ్యాక్సిన్ సన్నద్ధతలపై ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉన్నతస్థాయిలో నిర్వహించిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. రాబోతున్న పండుగల దృష్ట్యా వచ్చే శనివారం నుంచే వ్యాక్సిన్ వేయడం ప్రారంభించాలని దీనిలో ఖరారు చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ వేసేందుకు చేపడుతున్న కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్దదని ప్రధాని పేర్కొన్నారు. ఇదొక చరిత్రాత్మక ముందడుగుగా నిలిచిపోతుందన్నారు. వైద్యులు, ఆరోగ్యరంగ కార్మికులు, సఫాయి కర్మచారీలు సహా పలు వర్గాలవారికి ప్రాధాన్యం లభిస్తుందని ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ అందజేతకు రూపొందించిన కొ-విన్ డిజిటల్ వేదిక పనితీరు, సిబ్బందికి ఇచ్చిన శిక్షణల గురించి సమీక్ష సమావేశంలో ప్రధానికి అధికారులు వివరించారు. ఇప్పటికే 79 లక్షల మంది లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ వేసే కార్యక్రమంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, కరోనాపై పోరులో ముందు నిలుస్తున్న దాదాపు మూడు కోట్ల మందికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. 50 ఏళ్లు పైబడినవారికి, 50 ఏళ్లలోపు వయసున్నా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారికి ఆ తర్వాత ప్రాధాన్యం లభిస్తుంది. వీరంతా కలిపి దాదాపు 27 కోట్ల మంది ఉంటారని ప్రభుత్వ అంచనా. వయసు తెలుసుకోవడానికి తాజా ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటారు.