Share On

తెలంగాణ‌లో తొలిరోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి క‌రోనా టీకా ఇవ్వ‌నున్నారు. టీకా పంపిణీని చేపట్టినా తర్వాత క్రమేణా కేంద్రాల సంఖ్యను పెంచనున్నారు. వైద్యసిబ్బందికి అదనంగా పోలీసు, రెవెన్యూ, పురపాలక, సైనిక సిబ్బందికి కూడా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కేంద్రాల సంఖ్యను 1500కు పెంచనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మంది చొప్పున టీకాలు పొందడానికి తెలంగాణ‌ ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ లెక్కన తొలిరోజు 139 కేంద్రాల్లో సుమారు 13,900 మందికి టీకాలు ఇవ్వనున్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసిబ్బందికి కొవిడ్‌ టీకాలు వేయనున్నారు. ఆ తర్వాత సుమారు 2 లక్షల మంది పోలీసు, రెవెన్యూ, పురపాలక సిబ్బందికి టీకా ఇస్తారు. అనంతరం సుమారు 64 లక్షల మంది 50 ఏళ్లు పైబడినవారికి, సుమారు 6 లక్షల మంది 18-50ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కొవిడ్‌ టీకా ఇస్తారు. ఈ అన్ని కేటగిరీల వారికి కూడా ఉచితంగానే టీకా వేస్తారు. ప్రస్తుతానికి మాత్రం వైద్యసిబ్బంది జాబితాపై మాత్రమే స్పష్టత ఉంది. 2.90 లక్షల మంది వైద్యసిబ్బందికి సుమారు 7-10 రోజుల్లో తొలిడోసు పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తొలిడోసు పొందిన 28 రోజులకు రెండో డోసునిస్తారు. తొలిరోజు నిర్వహించనున్న 139 కేంద్రాలను మొత్తం 33 జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా జీహెచ్ఎంసీలో సుమారు 50కి పైగానే ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన వాటిని జిల్లాకు ఒకటి, రెండు చొప్పున నెలకొల్పనున్నారు. సుమారు 50 వరకూ ప్రైవేటు ఆసుపత్రులూ ఉంటాయని, ముఖ్యంగా 100 మందికి పైగా వైద్యసిబ్బంది ఉండే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వైద్యవర్గాలు తెలిపాయి. ఇందులోనూ జీహెచ్ఎంసీ పరిధిలోనే 40 వరకూ ప్రైవేటు ఆసుపత్రులుండే అవకాశాలున్నాయి. మిగిలినవాటిలో వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం వంటి చోట్ల ఒకటి, రెండు చొప్పున ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా పంపిణీ కేంద్రాలను నెలకొల్పనున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!