కరోనా డోసులు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రానికి చేరాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక వాహనంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 3.72 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి చేర్చారు. అక్కడ ఏర్పాటు చేసిన 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్లో టీకాలను నిల్వ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా వేయనున్నారు. మొత్తంగా తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రయివేటు వైద్య సిబ్బందికి టీకా వేయనున్నారు. వారంలో నాలుగు రోజులు వైద్య సిబ్బంది టీకాలు వేయనుంది. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
ముందుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి.. ఆ తర్వాత కొవిడ్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించనున్నారు. ఆ తర్వాత 50 ఏండ్లకు పైబడిన వారికి, అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్య క్రమంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఉదయం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి వ్యాక్సిన్‌ను ట్రక్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమానశ్రయానికి తరలించారు. 3.72 లక్షల డోసుల కొవిడ్ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్రానికి చేరుకున్నాయి.