Share On

భార‌త‌దేశంలో అభివృద్ది చేసిన రెండు ర‌కాల క‌రోనా వైర‌స్ నివార‌ణ వ్యాక్సిన్‌లు సుర‌క్షిత‌మైనవేన‌న‌ని కేంద్ర ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లు అత్యవసర వినియోగం కింద ఆమోదించబడ్డాయని, మరో నాలుగు వ్యాక్సిన్లు పురోగతిలో ఉన్నట్లు తెలిపింది. జైడస్‌ క్యాడిలా, స్పుత్నిక్‌-వి, బయోలాజికల్‌-ఇ, జెన్నోవా సంస్థలు కూడా తుదిదశ ప్రయోగాలను కొనసాగిస్తుండగా మరికొద్ది రోజుల్లోనే వీటిని కూడా అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. క‌రోనా టీకాలపై ప్రజలకు ఎటువంటి సందేహాలు లేకుండా, స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రెండు మోతాదుల్లో టీకాలు తీసుకున్న రెండు వారాల వరకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పంపిణీ సమయంలో ఇతర ఆరోగ్య కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో జరుగుతోందని తెలిపిది. ఈ నేపథ్యంలో ప్రజల సహకారం కావాలని కేంద్ర ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.

ఇప్పటికే సేకరించిన కరోనా వ్యాక్సిన్‌ల ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 1.1కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను సేకరిస్తుండగా, డోసు ధర రూ.200గా ఉన్నట్లు వెల్లడించింది. ఇక భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ 55లక్షల డోసులను తీసుకుంటుండగా, వీటిలో 38.5లక్షల డోసుల్లో ప్రతి డోసుకు రూ.295 ధర చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే, మరో 16.5లక్షల డోసులను భారత్‌ బయోటెక్‌ ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!