సంక్రాంతి పండుల సమయంలో పట్నం నుంచి చాలామంది పండుగకు స్వంత గ్రామాలకు వెళుతుంటారు. ఈ సమయంలో ఎక్కువశాతం ప్రయాణీకులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు. భోగీ పండుగ రోజు ఆనందంగా స్వంత గ్రామాలకు వెళుతున్న ప్రయాణీకులు ఊహించని రోడ్డు ప్రమాదంలో రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొనడంతో అందులో ప్రయాణిస్తున్న దాదాపు 24మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి ఆర్టీసీ బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.