
విపత్కర పరిస్థితుల్లో ఎంతో మందిని అదుకున్న సోనూసూద్ ఇప్పటికి తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నాడు. తీవ్ర నీటి ఎద్దడితో వెతలు అనుభవిస్తున్న ఓ గ్రామ ప్రజల పాలిట అతడు భగీరథుడయ్యాడు. చేతి పంపులు బిగించి అక్కడి ప్రజల దప్పికను తీర్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.
యూపీలోని ఝాన్సీ పరిధిలో ఒక గ్రామానికి చెందిన వ్యక్తి.. తమ గ్రామంలో నీటి సమస్య ఉందంటూ సోనూసూద్‌ను సంప్రదించాడు. దీనికి స్పందించిన సోనూ.. గ్రామంలో చేతి పంపులు బిగించాడు. ‘‘ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఉందని, తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడుస్తున్నామని అక్కడి వారు చెప్పడంతో పంపులు ఏర్పాటు చేశాడు. తద్వారా ఆ గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సోనూ తెలిపాడు. ఏదో ఒక రోజు ఆ గ్రామానికి వెళ్లి ఆ పంపులో వచ్చే మంచి నీటిని తాగుతానని చెప్పుకొచ్చాడు. కరోనా కష్ట కాలంలోనూ సోనూ పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఇటీవల ఉత్తరాఖండ్ వరదల్లో మృతి చెందిన ఒక వ్యక్తి కుటుంబానికి సైతం తన వంతు సాయం అందించాడు.