
చిన్న పట్టణానికి వార్డు సభ్యుడుగా గెలుపొందిన వారు కూడా ఈ రోజు హంగు, ఆర్బాటాలతో పాటు, లక్షల, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. రాబోయే తరం కూడా ఆనందంగా ఉండాలని ఇష్టానుసారంగా వెనుకేసుకునే వారికి ఇప్పటి సమాజంలో కొదువే లేదు. కాని పెద్ద నగరమైన అహ్మదాబాద్‌కు కొత్త మేయర్‌గా ఎన్నికైనా కిరీట్ పర్మార్, అత్యంత సామాన్యమైన జీవితం గడుపుతూ ఇప్పటికీ రేకుల షెడ్డులోనే నివాసం ఉంటున్నారు. కిరీట్ పర్మార్ ఇప్పటికీ రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు. అతడు ఉంటున్న రేకుల ఇంట్లో రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులు తప్ప లగ్జరీ సోఫా, ఫ్రిజ్ వంటి వస్తువులు లేవు.
కిరిట్ పర్మార్‌కు చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తో సంబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ నిబంధనలను అనుసరించి, జీవితకాల వివాహం చేయకూడదని అయన నిర్ణయించుకున్నారు. కిరీట్ పర్మార్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తికి ఇంత పెద్ద పదవి ఇచ్చిన బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పథకాలు సామాన్యులను చేరుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని తెలిపారు. తన జీవితాంతం దేశసేవ చేస్తానని తెలిపారు. కిరీట్ పర్మార్క ముందు, కనాజీ ఠాకూర్ అహ్మదాబాద్ మేయర్‌గా ఉన్నారు. ఆయన కూడా సాధారణ ప్రజలలాగే జీవించారు. మేయర్‌గా ఎన్నికైన తరువాత ప్రభుత్వం ఆయనకీ ఒక బంగ్లాను నివాసంగా ఏర్పాటు చేసింది. కానీ దానికి ఆయన నిరాకరించి మధుపురం ప్రాంతంలోని ఒక గదిలో నివాసం ఉన్నారు. ఇప్పటికీ ఆయన అదే గదిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం కనాజీ ఠాకూర్ అహ్మదాబాద్ కార్పొరేషన్ పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా ఉన్నారు. పెద్ద పదవి వచ్చిందని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడే ప్రమాదం లేదని, తానెప్పుడు అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ కొందరికైనా ఆదర్శంగా నిలవాలనుకుంటున్నానని పర్మార్ అంటున్నారు.