
కరోనా మళ్లీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఉన్న ఒక కాలేజీలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఆ కాలేజీలో రెండు రోజులుగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మొదటి రోజు కొందరు విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 13 కేసులు బయటపడ్డాయి. రెండో రోజు 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గిందిలే అని ఆ కాలేజీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కాని తాజాగా సోమవారం చేసిన కరోనా పరీక్షలో ఏకంగా 140 కరోనా కేసులు బయటపడటంతో కాలేజీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 700 మంది విద్యార్థుల నుంచి నమూనాలను యాజమాన్యం సేకరించింది. వీటిల్లో 140 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ వచ్చిన వారందరినీ ఒకే క్యాంపస్లో ఉంచి ఆ ప్రాంతాన్ని కంటోన్మైంట్ జోన్ గా చేశామని అధికారులు వెల్లడించారు. నెగిటివ్ వచ్చిన 450 మందిని వేరే హాస్టల్ కు తరలించినట్టు వివరించారు. ఈ పరిణామంతో తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యార్థుల్లో కరోనా కేసులు రావడంతో తల్లిదండ్రులు కూడా భయపడిపోతున్నారు.