
పెరుగుతున్న ధరల దృష్ట్యా భోజనానికి ఏ హోటల్‌కు వెళ్లినా తక్కువలో తక్కువ వంద రూపాయలైనా ఉంటుంది. ఇంక రెస్టారెంట్‌కు వెళుతే మాత్రం మనం తినే పదార్థాలను బట్టి బిల్లు ఎంతైనా కావచ్చు. కాని ఒక అవ్వ నిత్యం ఎంతోమందికి కడుపునిండా తిండిపెడుతోంది. అ అవ్వ వండే ఆహారం కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు కడుపునిండా తినండా, కాని బిల్లు మాత్రం మీరు తోచినంతనే ఇవ్వండి అని అంటుంది. డబ్బు ఉన్నవారు, లేని వారు అని చూడకుండా ఎవరెంత ఇచ్చినా ఆనందంగా నవ్వుతూ తీసుకుంటుంది. రోజురోజుకు వయస్సు మీద పడుతున్నా కూడా తన శక్తిమేరకు ఎంతోమంది కడుపునింపుతూనే ఉంది.
కేరళలోని కొల్లాం రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో యశోదమ్మ హోటల్ అని ఉంది. ఆ హోటల్లో పనివాళ్లు ఎవరూ ఉండరు. ఒకే ఒక్క వృద్ధ మహిళ అన్నీ తానై వంట చేస్తుంది, వడ్డిస్తుంది. ఆమె ఎవరో కాదు చిన్నగా హోటల్ నడిపిస్తు ఎంతోమంది ఆకలి తీర్చుతున్న యజమాని యశోదమ్మ. ఆమె వయసు దాదాపు 70 ఏళ్లు. ఆమె ఉదయాన్నే అయిదు గంటలకు నిద్ర లేచి పది గంటలకల్లా వంటకాలను సిద్ధం చేస్తుంది. కనీసం 50 మందికి సరిపడా భోజనాన్ని కేవలం ఐదు గంటల్లో తయారుచేస్తుంది. 70 సంవత్సరాల వయసులో కూడా ఎవరి సాయం తీసుకోకుండా ఆమె ఒక్కరే వంటలు సిద్ధం చేస్తుంది. ఆమె ఒక్కరే ఏదో ఒకటి వండిపెట్టకుండా వెజ్, నాన్ వెజ్ వంటకాలను కమ్మని రుచితో తయారుచేస్తుంది. ఈమె హోటల్లో ఎటువంటి ధరల పట్టికలు ఉండవు.. క్యాషియర్ ఉండడు. కేవలం ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది. అదే ఆ హోటల్లో క్యాష్ కౌంటర్. భోజనం చేసిన వాళ్లు ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఆ బాక్స్‌లో వేసి వెళ్తే చాలు. దాదాపు 70 ఏళ్ల వయసులో ఇంత కష్టపడుతూ.. లాభాపేక్ష లేకుండా ఆమె చేసే సేవపై చుట్టుపక్కల వాళ్లు ఎంతో మెచ్చుకుంటున్నారు. ఈ హోటల్ గురించి యశోదమ్మను అడిగితే.. పక్కవారి ఆకలి తీర్చడంలో కన్నా సంతృప్తి ఇంకెందులో ఉంటుందని ఆమె అంటున్నారు. ఆ హోటల్ సమీపంలో పలు కోచింగ్ సెంటర్లున్నాయి. దాంతో విద్యార్థులు, ఫ్యాకల్టీ, బాటసారులు యశోదమ్మ హోటల్‌కు క్యూ కడుతున్నారు.