
పర్యావరణాన్ని కాపాడాలి.. ప్లాస్టిక్‌ను నిర్మూలించాలి అని ఎంత ప్రచారం చేస్తూనే ఎవరి పని వారే చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడడం వల్ల జంతువులు అర్థాంతరంగా ప్రాణాలు కొల్పొతున్నాయి. ఇప్పుడు చెరువులు, సముద్రాలలో ఉండే చేపలు ప్లాస్టిక్ ధాటికి బలైపోతూనే ఉన్నాయి.
కర్ణాటకలోని ఫిష్ మార్కెట్లో చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కోయిస్తుండగా విచిత్ర అనుభవాన్ని ఫేస్ చేశాడు. చేప కడుపు లోపల భారీ ప్లాస్టిక్ కవర్లు దర్శనమిచ్చాయి. దాని కడుపులోని ప్లాస్టిక్ మొత్తాన్ని తూకం వేస్తే.. 10 కిలోలుగా తేలింది. అత్తావర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. చేప కడుపులో ప్లాస్టిక్ కవరును చూసి కంగుతిన్న స్థానికులు దాన్ని వీడియో తీశారు. మేము దీనిని మొదటిసారిగా గమనిస్తున్నాము. ప్రజలు ఈ స్థాయిలో ప్లాస్టిక్‌ను సముద్రంలోకి పోయడం కొనసాగిస్తే, చేపల పెంపకం తీవ్రంగా ప్రభావితమవుతుందని చేపల షాపు యజమాని అంటున్నాడు. ప్లాస్టిక్ తినకూడదని మనం చేపలకు చెప్పలేం, కాని వ్యర్థాలను సముద్ర జలాల్లోకి డంప్ చేయకుండా ఆపాలని పర్యావరణ వేత్తలు అంటున్నారు.