స‌న్యాసిగా మారిన క‌డ‌ప మాజీ ఎమ్మెల్యే

Share On

అత‌ను రాజ‌కీయాల్లో చాలా సీనియ‌ర్ నాయ‌కుడు. జ‌న‌తా ప్ర‌భుత్వం నుంచి రాజ‌కీయాల్లో ఉన్నాడు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడుగా పేరుగాంచాడు. ఎన్నో సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప‌లు మార్లు గెలుపొంది క‌డ‌ప జిల్లాలోనే త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. అలాంటీ సీనియ‌ర్ నాయ‌కుడు రాజ‌కీయ స‌న్యాసం కాకుండా మొత్తం త‌న జీవితానికే స‌న్యానం పుచ్చుకున్నాడు.

క‌డ‌ప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ శివరామకృష్ణారావు రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు. డాక్టర్‌ వడ్డెమాను శివరామకృష్ణారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇదే నియోజకవర్గంలోని అట్లూరు మండలం కమలకూరు స్వగ్రామం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా ఈయన క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు. 1972లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బిజివేముల వీరారెడ్డిపై తొలుత ఓటమి చెందారు. 1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 1994, 1999, 2001 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. శివరామకృష్ణారావుతోపాటు అప్పట్లో పులివెందుల నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మైదుకూరు నుంచి డీఎల్‌ రవీంద్రారెడ్డిలు 1972లో తొలిసారి గెలుపొందారు. ముగ్గురు వైద్యులు కావడం, యువకులుగా అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. నాటి ముఖ్యమంత్రి అంజయ్య కేబినెట్‌లో మంత్రి పదవి అవకాశం వచ్చినా తన మిత్రుడైన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కోసం త్యాగం చేసి వైఎస్‌కు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు పొందారు. 2004లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండోసారి సీఎంగా ఎన్నికైన వైఎస్సార్‌ ఆయనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని భావించినా ఆయన అకాల మరణం శివరామకృష్ణారావుకు ఊహించని షాక్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఏపీ స్టేట్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు.

2015 నుంచి ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపిన శివరామకృష్ణారావు మానస సరోవర్, చార్‌దాం, అమర్‌నాథ్‌తో పాటు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్‌కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు. మూడు నెలలుగా పూర్తి ఆధ్యాత్మిక జీవితంవైపు ఆకర్షితులైన చివ‌ర‌కు సన్యాస దీక్ష తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద గురువు శ్రీ సద్గురు తత్వ విదానందసరస్వతీ ఆధ్వర్యంలో దీక్ష తీసుకున్నారు. స‌ర్వకాల సర్వావస్థల యందు భగవంతుని చింతతోనే గడపాలన్నది లక్ష్యమన్నారు. సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే రాజకీయాలను వదిలి సన్యాసం స్వీకరించడం బలమైన నిర్ణయమే. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!