
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు విచ్చలవిడిగా పెరిగిపోతూనే ఉన్నాయి. అవకాశం వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిణి ఖాతా నుంచి ఏకంగా 1.63లక్షలు కాజేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతానికి చెందిన ఒక అధికారిణి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ఆమె మేక్ మై ట్రిప్ ద్వారా విమాన టిక్కెట్లు కొనుగోలు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రయాణ తేదీలను మార్చుకోవాల్సి రావటంతో ఆమె మేక్ మై ట్రిప్ కస్టమర్ కేర్ నంబరు కోసం ఇంటర్నెట్లో వెతికారు. నంబర్ సంపాదించి ఫోన్ చేయగా ఆ కాల్ మధ్యలోనే కట్ అయింది. ఆ తరువాత ఆమెకు మరో నంబరు నుంచి సైబర్ నేరగాళ్లు వల విసిరారు. మేక్ మై ట్రిప్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని, ఏం సాయం కావాలో చెప్పాలని కోరారు. ఆమె సమస్యను మొత్తం వారికి వివరించడంతో మీ చరవాణికి ఒక లింక్ పంపిస్తామని దాని ద్వారా తేదీలను మార్చుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఇంతలో చరవాణికి వచ్చిన లింక్‌ను ఆమె క్లిక్ చేయడంతో ఆ నంబర్‌కు లింకైన బ్యాంకు ఖాతా నుంచి రూ.1,62,999 మాయమయ్యాయి. దీనిపై ఆమె వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే సదరు ఖాతా నుంచి ఏ వాలెట్‌కు నగదు వెళ్లిందో గుర్తించారు. ఆ వాలెట్‌ను స్తంభింపజేసి రూ.1.5లక్షల నగదును తిరిగి బాధితురాలికి ఇప్పించారు.