
ఎసిబి అధికారులకు సమాచారం పోయిందని, వారి వచ్చి నన్ను పట్టుకుంటారని భయంతో ఏకంగా 5లక్షల రూపాయల కొత్త నోట్లను ఒక మాజీ మండల ఉపాధ్యక్షుడు తగలబెట్టేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మాజీ మండల ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ తాను చేసిన అక్రమాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎంత ప్రయత్నించినా అతనికి ఫలితం లేకపోయింది. చివరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు వెల్లడించిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్ ఒక పని నిమిత్తం ఒక వ్యక్తి నుంచి రూ.6 లక్షలు డిమాండ్ చేశారు. బేరాసారాలు ముగిశాక చివరికి రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ 5 లక్షల లంచాన్ని తనకు ఇవ్వకుండా వెంకటయ్య గౌడ్‌కు ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ సూచించారు. ఆయన సూచన మేరకు బాధితుడు రూ.5 లక్షలను వెంకటయ్య గౌడ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అధికారులను చూసి ఈ రూ.5 లక్షలను వెంకటయ్య గౌడ్ తగలబెట్టేశాడు. వెంటనే అధికారులు మంటలను ఆర్పేసి సగం కాలిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు.