
అందరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, మాస్క్ పెట్టుకుంటేనే కరోనా నుంచి మన ప్రాణాలను, ఇతర ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రభుత్వాలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. పోలీసులు కూడా మాస్క్ పెట్టుకొని వారిపై పలు సూచనలు చేస్తూ జరిమానా విధిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో మంగళవారం మధ్యాహ్నం ఒక సంఘటన చోటు చేసుకుంది. 35 ఏండ్ల వయసున్న ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్న తన తండ్రి కోసం భోజనం తీసుకెళ్తున్నాడు. అయితే అతను సరిగా మాస్కు ధరించలేదని పోలీసులు ఆపారు. ఆ తర్వాత అతన్ని రోడ్డుపై పడేసి తీవ్రంగా కొట్టారు. తలపై కాలు పెట్టి తొక్కారు. ఆ వ్యక్తి బంధువులు ఎంత వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించలేదు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు వ్యక్తిని కొట్టిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. మాస్క్ గురించి చెప్పాలి లేదా జరిమానా విధించాలి కాని తీవ్రంగా కొట్టడం తప్పని ప్రజలు అంటున్నారు.