
మూడు కాళ్లతో ఆడశిశువు జన్మించింది. ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఏమి కాదంటూ వైద్యులు భరోసా ఇచ్చి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి వెన్నుముకలో ఉన్న ఒక కాలును తీసివేసి ఆ చిన్నారికి ప్రాణం పోసి, ఆ తల్లిదండ్రుల జీవితాల్లో ఆనందాన్ని నింపారు.
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిపాలెం గ్రామానికి చెందిన మోహనరావు, వెంకటేశ్వరమ్మ దంపతులు. వీరికి తొలికాన్పులో ఆడబిడ్డ జన్మించింది. మార్చి 4వ తేదీన రెండో కాన్పు కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఐతే పాప మూడు కాళ్లతో జన్మించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మూడోకాలు వెన్నుముక బాగం నుంచి బయటకు ఉండటంతో డాక్టర్లు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుంటూరు జీజీహెచ్ కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ పాపను పరీక్షించిన న్యూరో విభాగం వైద్యులు ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. న్యూరో సర్జరీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.శేషాద్రి శేఖర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ హనుమ శ్రీనివాసరెడ్డి, పీజీ డాక్టర్లు ధీరజ్, సత్య, విజయ్ తో కూడిన బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి మూడోకాలును తొలగించారు. నడుం భాగంలో మిగిలిన రెండు కాళ్లకు సంబంధించిన నరాలు కాలుకు అతుక్కుని పోవడంతో వాటిని ఆధునిక చికిత్స ద్వారా వేరు చేసినట్లు డాక్టర్లు తెలిపారు. ఐతే నడుం నుంచి వచ్చిన మూడో కాలుకు పురుష జన నంగాలు ఉండటం గమనార్హం. దీనిని వైద్య భాష లో లంబర్ మైలో మీనింగ్ సీల్ విత్ ట్రైపీడస్ డిఫార్మటి గా పిలుస్తారని వెల్లడించారు. ఇప్పటివరకు గుంటూరు జీజీహెచ్ లో ఇలాంటివే 21 కేసులు నమోదయ్యాయని ఇది 22వ కేసు అని డాక్టర్లు తెలిపారు. ఈ కేసును అంతర్జాతీయ వైద్య సదస్సులో ప్రచురిస్తామన్నారు.