
అంతా వాళ్ల ఇష్టమేనంట.. తమ భూమిని తమకు తెలియకుండా వేరే వాళ్ల పేరు మీద బాధ్యత కలిగిన తహశీల్దార్ విచారణ ఏలా రాస్తాడో అర్థం కావట్లే.. ఒక జిల్లా కేంద్రానికి చెందిన తహశీల్దార్ మామూళ్లకు అలవాటు పడి తమకు అన్యాయం చేసాడని ఒక ఆడబిడ్డ పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్కు విన్నవించినా కనీసం విచారణ చేయట్లేదు.. అసలు పెద్ద పెద్ద అధికారులు ఎవరికోసం పనిచేస్తున్నారో, ఎవరిని కాపాడుతున్నారో అర్థం కావట్లేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ములుగు మండలంలోని దేవగిరిపట్నానికి చెందిన సానికొమ్ము విజయలక్ష్మి భర్త శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది నవంబర్ 11వ తేదీన మృతి చెందారు. భర్త చనిపోయిన దుఃఖంలో ఆవిడ ఉంటే, ఆమెకి తెలియకుండా, ఏలాంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు, ఆమె భర్త సోదరుడు వెంకటప్పారెడ్డి పేరుమీద తన భూమి 7:39 గుంటలు పట్టా చేశారు. ఈ విషయంలో కలెక్టరు వినతిపత్రం ఇవ్వడంతోపాటు, ఆర్డీఓ, తహసీల్దారుకు సమాచారం అందించారు. అఫిడవిట్లో ఆమె భర్త దగ్గర ఉండడం లేదని పేర్కొన్నారు. కానీ ఆయన మృతిచెందే రోజు వరకు ఆయన తోనే ఉన్నానని ఆమె అన్నారు. అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారనీ, కనీస సమాచారం ఇవ్వకుండా ఎవరు ఎలాంటి దొంగ పత్రాలు సృష్టించి ఇచ్చిన వారి పేరు మీద చేస్తే ఎలా అని ఆమె విమర్శించారు. తన భర్త సోదరులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై, కాసుల కక్కుర్తితో తనకు చెందాల్సిన భూమిని వారి పేరు మీద పట్టా పాస్బుక్ చేశారని అన్నారు. అన్ని ఆధారాలు సమర్పించిన కూడా లీగల్గా చూసుకోవాలని అధికారులు అంటున్నారని, పట్టా చేసే ముందు ఏ చట్టం ప్రకారం చేశారో చెప్పాలని ఆవిడ అంటోంది. ఇప్పటికైనా కలెక్టర్ దీనిపై విచారణ చేయించి అక్రమ పత్రాలు సృష్టించిన వారిపై, వారికి సహకరించిన ములుగు మండల రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోని, తమ భూమి తమకు వచ్చేలా చేయాలని ఆమె కోరారు. లేదంటే హైదరాబాద్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లైనా పోరాడుతానని ఆమె అన్నారు.