చ‌దివిందీ బిటెక్‌.. చోరీలు మాత్రం ఏడు రాష్ట్రాల్లో

Share On

బాగా సంపాదించాలి అనుకొని న‌గ‌రానికి వ‌చ్చాడు బిటెక్ చ‌దివిన ఒక యువ‌కుడు. చిన్న మొబైల్ షాపులో టెక్నిషియ‌న్‌గా చేరాడు. కాని అనుకున్నంత ఆదాయం రావ‌ట్లేద‌ని దొంగ‌త‌నాలే వృత్తిగా ఎంచుకున్నాడు. అదీ కూడా స్నేహితుల పేరిట న‌మ్మిస్తూ వారి ఐడీ ప్రూప్స్ దొంగ‌త‌నంగా కొట్టేసి, ఆ ఐడీ ప్రూప్స్ పెట్టి అద్దె వాహ‌నాలు తీసుకుంటూ, వాటిని అమ్ముతూ జల్సాలు చేశాడు. చివ‌ర‌కు పోలీసుల‌కు దొరికి జైలు పాల‌య్యాడు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని సీసలి గ్రామానికి చెందిన 27 ఏళ్ల గూడాటి మహేశ్ నూతన్ కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. 2016వ సంవత్సరంలోనే అతడి బీటెక్ పూర్తయింది. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి ఓ మొబైల్ షాపులో టెక్నీషియన్ గా చేరాడు. ఆదాయం అంతగా ఉండకపోవడంతో రూటు మార్చాడు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే అద్దెకు వాహనాలు ఇచ్చే సంస్థలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయని అతడికి తెలిసి, వాటినే చోరీ చేయాలని ఫిక్సయ్యాడు. తన ప్రూఫ్స్ ఇస్తే దొరికిపోతానని భావించి ఒక కొత్త ప్లాన్ వేశాడు. రూమ్ షేరింగ్ యాప్స్ ద్వారా గదుల్లో అద్దెకు దిగేవాడు. దీనికోసం మారు పేర్లను వాడుతూ తనతోపాటు అద్దెకు ఉండేవాళ్లతో పరిచయం పెంచుకొని మంచివాడిగా నటించేవాడు.

ఆ తర్వాత వారి వద్ద నుంచి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, డబ్బు, నగలు వంటి వాటితో ఎస్కేప్ అయ్యేవాడు. ఇలా హైదరాబాద్, వైజాగ్, పూణె, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో గదుల్లో అద్దెకు దిగి తోటి వారి వద్ద నుంచి చోరీలకు పాల్పడేవాడు. వాళ్ల ఐడీ కార్డులను ఇచ్చి కార్లను అద్దెకు తీసుకునేవాడు. వాటికి ఉన్న జీపీఎస్ ట్రాకర్స్ ను తీసేసేవాడు. వాటిని హైదాబాద్ కు తీసుకొచ్చేవాడు. మేడ్చల్ జిల్లాలోని చెంగిచెర్లలో ఒక‌ గదిని అద్దెకు తీసుకుని వాటిని అక్కడ ఉంచుతూ వచ్చాడు. అలా దాదాపు పదికి పైగా కార్లను చోరీ చేశాడు. నెల రోజుల క్రితం జూమ్ కార్స్ ప్రతినిధులు మాదాపూర్ పోలీసులకు చేసిన ఫిర్యాదుతో అతడి ఆటను కట్టించారు. చోరీ చేసిన వాటిల్లో రెండు కార్లను అతడు అమ్మేసినట్టు గుర్తించారు. 70 లక్షల రూపాయల విలువ చేసే ఇన్నోవా క్రిస్టా, వోక్స్ వాగన్ పోలో, మారుతి బెలోనో, రెండు స్విప్ట్ కార్లు, వెర్నా కారు, రాయల్ ఎన్ ఫీల్డ్ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!