కొద్దిరోజుల్లో పెళ్లి.. పెళ్లికూతురు కిడ్నాప్‌, హ‌త్య

Share On

కొద్దిరోజుల్లో పెళ్లిపీట‌ల మీద కూర్చోవాల్సిన పెళ్లికూతురును కిడ్నాప్ చేసి, అత్యంత దారుణంగా చంపేశారు. ఎవ‌రో కిడ్నాప్ చేశారో, అంత దారుణంగా ఎందుకు చంపారో తెలియ‌క పెళ్లి కూతురు త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. పెళ్లికి క‌ట్న‌కానుక‌లు భారీగానే ఇస్తున్నామ‌ని, ఘ‌నంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుండ‌గా ఈ దారుణం జ‌రిగిందంటున్నారు. త‌న కూతురు దారుణ హ‌త్య‌కు పెళ్లి కొడుకే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వారు ఆరోపిస్తున్నారు. ఆ యువకుడికి ఇంతకుముందే ఒక‌ అమ్మాయితే ప్రేమ వ్యవహారం ఉందనీ, వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా ద్వారక బిగాహా గ్రామానికి చెందిన ఒక‌ 19 ఏళ్ల యువతికి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్ అనే యువకుడితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లికిగాను వరుడికి దాదాపు 4 లక్షల విలువైన కట్నకానుకలు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించారు. పెళ్లి శుభలేఖలు కూడా బంధువులందరికీ పంచేశారు. కొద్ది రోజుల్లో పెళ్లనగా ఆ యువతిని ఎవరో కిడ్నాప్ చేశారు. తమకు ఎవరూ శత్రువులు లేరనీ, అమ్మాయికి కూడా గతంలో ఎలాంటి బెదిరింపులు రాలేదని తల్లిదండ్రులు వాపోయారు. ఆమెకు ప్రేమ వ్యవహారాలు లాంటివి కూడా లేవని చెబుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువ‌తి మిస్స‌యిన తెల్లారే గుర్తు తెలియ‌ని యువ‌తి శ‌వాన్ని స్థానికులు గుర్తించారు. ఆ మృతదేహం కిడ్నాప్ గురైన‌ యువతిదేనని పోలీసులు తేల్చారు. తల్లిదండ్రులు ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు వచ్చి క‌న్నీరుతో కుప్పకూలిపోయారు. ఆ యువ‌తి మృతదేహానికి తల లేదు. అత్యంత కిరాతకంగా ఆ యువతి కాళ్లు, చేతులను కట్టేసి మరీ ఆ యువతి తల నరికేసి దారుణంగా చంపేశారు. తలలేని ఆ యువతి శవాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు మిస్సింగ్ కేసును కాస్తా మర్డర్ కేసుగా మార్చి విచారణ చేపడుతున్నారు. ఆజాద్ వల్లే తమ కుమార్తె తమకు దక్కకుండా పోయిందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆజాద్ కు గతంలో వేరే అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని చెబుతున్నారు. తమ కుమార్తెతో పెళ్లి నచ్చని ఆ యువతి తరపు వాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని వాళ్లు అనుమానిస్తున్నారు. త‌మ కూతురును అత్యంత దారుణంగా చంపిన వారిపై క‌ఠినంగా శిక్షించాల‌ని త‌ల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!