ఇదేంద‌ని అడిగినందుకు.. అధికారుల‌పై పెళ్లి బృందం దాడి

Share On

క‌రోనా వైర‌స్ దేశాన్ని వ‌ణికిస్తోంది.. సెకండ్ వేవ్‌తో కేసుల‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా విప‌రీతంగా పెరిగిపోతుంది.. క‌రోనా నియంత్రించేందుకు ప్ర‌భుత్వాలు క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌లు పెళ్లిళ్లు ఇత‌ర కార్య‌క్ర‌మాలు ఏమి చేసినా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ప‌రిమిత సంఖ్య‌లో పిల‌వాల‌ని చెపుతున్నారు. ఐనా కొన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఒడిశాలో ఇలాగే ఒక‌ పెళ్లి వేడుకలో పెళ్లి బృందం నిబంధ‌న‌లను అతిక్రమించారు. ఇదేంటని ప్రశ్నించినందుకు అధికారులపై పెళ్లి బృందం దాడి చేసింది. ఎమ్మార్వోతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్స్‌ను చితకబాదారు. గజపతి జిల్లాలోని ఆర్.ఉదయగిరి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం చెలిగడ గ్రామంలో ఒక‌ వివాహ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత ఊరేగింపు వేడుకను నిర్వహించారు. పెద్ద మొత్తంలో బంధువులు, స్థానికులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న తహశీల్దారు శృతిరంజన్ పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. కరోనా సమయంలో ఇంత మంది గుమిగూడవద్దని పెళ్లిళ్లపై ఆంక్షలు ఉన్నాయని తెలియదా అని ప్రశ్నించారు. అనంతరం ఊరేగింపును అడ్దుకునే ప్రయత్నం చేయడంతో.. పెళ్లి బృందం రెచ్చిపోయింది. ఊరేగింపును అడ్డుకుంటారా అని దాడికి పాల్పడ్డారు. స్థానికుల దాడిలో తహశీల్దారు శృతిరంజన్ శతపతి, ఎస్సైలు ముకేశ్ లక్రా, హేమంత్ సేథితో పాటు నలుగురు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. వారిని ఆర్‌.ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న సబ్‌డివిజన్‌ పోలీస్‌ అధికారి దిలీప్‌కుమార్‌ గ్రామానికి చేరుకొని స్థానికులను ప్రశ్నించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పారిపోయారు. మరికొందరిని మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై సబ్ కలెక్టర్ సంగ్రాం కేసరి ఆరా తీశారు. గ్రామస్తుల దాడి గురించి తహశీల్దార్‌తో చర్చించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎవరినీ వదిలిపెట్టకూడదని అధికారులను ఆదేశించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!