అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రో కీల‌క ముందడుగు

Share On

అగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా వైర‌స్ అంత‌మొందించేందుకు మ‌రో కీల‌క ముందడుగు వేసింది. ఫైజర్-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకాను 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు వారికి కూడా అందించేందుకు ఆ దేశ ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఈ వివరాలను వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ(సీడీసీ)కి చెందిన సలహా బృందం సమీక్షించనుంది. ఫలితాలు ఆశాజనకంగా ఉంటే అత్యవసర వినియోగానికి ఈ బృందం సీడీసీకి సిఫార్సు చేస్తుంది. సీడీసీ అనుమతిస్తే టీకా 12-15 ఏళ్ల వారికి కూడా అందుబాటులోకి వస్తుంది. గతంలోనే 16 ఏళ్ల పైబడిన వారికి ఈ టీకా అందించేందుకు అమెరికా ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనాపై తాము చేస్తున్న పోరులో ఇదో కీలక ముందడుగుగా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.

కరోనాను అంతమొందించి అమెరికాలో సాధారణ పరిస్థితులను నెలకొల్పే దిశగా సాగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ఎఫ్‌డీఏ కమిషనర్‌ డాక్టర్‌ జానెట్‌ వుడ్‌కాక్‌ అభిప్రాయపడ్డారు. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా జరిపిన క్లినకల్‌ ట్రయల్స్‌లో 12-15 మధ్య వయసు వారిలోనూ ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తుందని గుర్తించారు. దాదాపు 2,260 మంది పిల్లలపై ప్రయోగాలు జరిపారు. భారత్‌లో కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో అమెరికాలో ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. భారత్‌ టీకాల కొరతతో సతమతమవుతోంది. మరోవైపు కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మూడో దశ కూడా రావొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. అప్పుడు చిన్నారులకు ముప్పు ఎక్కవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఫైజర్‌ టీకా చిన్న వయసు వారికి కూడా అందుబాటులోకి రావడం గమనార్హం. అయితే, భారత్‌లోనూ తమ టీకా వినియోగానికి ఫైజర్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల తెలిపింది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!