మీ శ‌రీర బ‌రువు త‌గ్గండి.. ప్రోత్సాహ‌కాలు తీసుకొండి

Share On

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల చాలామంది ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.. ఇళ్ల‌లో ఖాళీగా ఉండ‌డంతో ఎంతోమంది బ‌రువు పెరిగారు. యూకేలో నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో 41శాతం మంది లావ‌య్యార‌ని స‌గ‌టున ఒక్కొక్క‌రు 4కిలోలు పెరిగిన‌ట్లు నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్ అంచ‌నా వేసింది. అధిక బ‌రువు వ‌ల్ల‌ల‌ దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అక్కడి పౌరులకు సన్నబడాలని సూచించింది.

యూకే ప్రజలు బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉండటం కోసం బ్రిటన్‌ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. బ్రిటన్‌ పౌరుల్లో ఎవరైతే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారో వారికి నగదు ప్రోత్సాహకాలు, బోనస్‌లు, డిస్కౌంట్‌ కూపన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జంక్‌ఫుడ్‌ తినడం మానేసి, ఎక్కువ కూరగాయాలు.. పండ్లు తినేవారికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారట. ఊబకాయంపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరీస్‌ జాన్సన్‌ సైతం ఈ కార్యక్రమంలో భాగమై బరువు తగ్గుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రోత్సాహకాలకు అర్హులను ఎంపిక చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్‌ ద్వారా సూపర్‌ మార్కెట్లలో పౌరుల నెలవారీ కొనుగోళ్ల లెక్కలను విశ్లేషించనున్నారు. ఎవరైతే జంక్‌ఫుడ్‌ను తగ్గించి.. కూరగాయాలు, పండ్లు కొనుగోలు చేస్తారో వారిని గుర్తించి యాప్‌ ద్వారానే లాయల్టీ పాయింట్లు ఇస్తారు. విద్యాసంస్థలకు, ఆఫీసులకు వాహనాల్లో కాకుండా కాలినడక వెళితే అదనంగా మరిన్ని పాయింట్లు లభిస్తాయి. అలా వచ్చిన పాయింట్లను క్యాష్‌బ్యాక్‌ రూపంలో నగదుగా మార్చుకోవచ్చు లేదా డిస్కౌంట్‌.. ఫ్రీ టికెట్స్‌ పొందొచ్చు. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం అమలుకు, యాప్‌ అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇలాంటి కార్యక్రమమే దుబాయ్‌లో కొన్నేళ్ల కిందటి నుంచి అమలు చేస్తున్నారు. అక్కడ కూడా ఊబకాయం, అధిక బరువు సమస్యలు ఉండటంతో ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. పౌరులు తమ శరీర బరువులో ఎన్ని కిలోలు తగ్గితే అన్ని గ్రాముల బంగారం ఇస్తున్నారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *