రేప్ కేసు రాజీ చేసుకొని పెళ్లి చేసుకున్నారు

Share On

నువ్వంటే ఇష్ట‌మ‌ని చెప్పి మ‌హిళ‌కు ద‌గ్గ‌రై శారీర‌కంగా ఒక్క‌ట‌య్యారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకొన‌ని మోసం చేయ‌డంతో ఆ మ‌హిళ రేప్ కేసు పెట్టింది. అతడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత ఆమె కేసు వెనక్కి తీసుకోవడంతో ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య గొడవలు రావడంతో భర్త ఆమెను నైనిటాల్‌లో కొండలపైకి తీసుకెళ్లి కిందికి తోసి చంపేశాడు. గత నెలలో జరిగిన ఈ హత్యకు సంబంధించి నిందితుడైన యువకుడిని సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తరాఖండ్‌లోని ఉదం సింగ్ నగర్ జిల్లాకు చెందిన 24 ఏండ్ల సేల్స్‌మ్యాన్ రాజేశ్ రాయ్‌ ఢిల్లీలో సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఢిల్లీకి చెందిన బబిత (29) అనే మహిళతో పరిచయమై, అది ప్రేమగా మారింది. అతడు ప్రేమలో ఉండగా గత ఏడాది మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. పెండ్లి చేసుకుంటానని చెప్పి దగ్గరైన రాజేశ్ ఆ తర్వాత ఆమెను మోసం చేశాడు. దీంతో అతడిపై బబిత గత ఏడాది జూన్‌లో రేప్‌ కేసు పెట్టింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీసులు రాజేశ్‌ను అరెస్ట్ చేసి, తీహార్‌‌ జైలుకు పంపారు. అయితే తర్వాత ఇద్దరూ పెండ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో బబిత కంప్లైంట్ వెనక్కి తీసుకుంది. అక్టోబర్‌‌లో రాజేశ్ జైలు నుంచి విడుదల కావడంతో డిసెంబర్‌‌లో పెండ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్లిద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. రాజేశ్ తమ బిడ్డను హింసిస్తున్నాడంటూ బబిత తల్లిదండ్రులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇకపై బాగా చూసుకుంటానంటూ అత్తమామలను ఒప్పించిన రాజేశ్.. బబితను గత నెల 11న ఉత్తరాఖండ్‌లోని స్వస్థలానికి తీసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత బబిత ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తుండడంతో తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు రాజేశ్ రాయ్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతడు నేరాన్ని ఒప్పుకొన్నాడు. భార్యను తన ఊరికి తీసుకెళ్లాక మళ్లీ గొడవ జరిగిందని, ఆ తర్వాత ఆమెను నైనిటాల్‌ టూర్‌‌కు అని చెప్పి తీసుకెళ్లి కొండల పై నుంచి తోసి చంపేసినట్లు పోలీసులకు చెప్పాడు. అతడిపై మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేశామని, ప్రస్తుతం బబిత డెడ్‌బాడీ కోసం ఆ కొండ ప్రాంతంలో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *