గంజాయి వ్యాపారం చేస్తూ.. 30మంది యువ‌తిల‌ను మోసం చేసి..

Share On

అమ్మాయిల‌ను న‌మ్మిస్తూ.. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మిస్తూ.. మ‌రికొంత‌మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని చెపుతూ ఒక‌రు కాదు ఇద్ద‌రూ కాదు 30మంది అమ్మాయిల‌ను మోసం చేసిన గంజాయి వ్యాపారిని, మోస‌గాడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.. అత‌ని నుంచి రూ.లక్ష విలువైన గంజాయి, రెండు చరవాణులు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పోలీసు అతిథిగృహంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సెంథిల్‌కుమార్‌ నిందితుడిని చూపి వివరాలు వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం ఎన్‌.ఆర్‌.పేటకు చెందిన ఒక‌ యువతికి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికల పూడికి చెందిన శ్రీనివాస్‌ ఫోన్‌ చేశాడు. మ్యాట్రిమోనియల్‌ ప్రొఫైల్‌ చూశానని, నచ్చావని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజులు మాటలు కలిపి తనకు నగదు అవసరమని చెప్పి మదనపల్లెలోని మరో యువతి ఖాతాకు పంపాలని కోరాడు. ఆమె రెండుసార్లు రూ.1.35లక్షలు పంపింది. ఆ మరుసటిరోజు నుంచే అతని చరవాణి పనిచేయక పోవడంతో ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో చిత్తూరు డీఎస్పీ సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించాం. వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మదనపల్లె యువతి ఖాతాను పరిశీలించగా ఆమె సైతం అతడి ఖాతాకు రూ.7లక్షలు పంపినట్లు తేలింది. అతడు హైదరాబాద్‌, వైజాగ్‌, చెన్నై, బెంగళూరు, పుణె, ఇతర ప్రాంతాలకు చెందిన యువతులను ఇదేవిధంగా మోసం చేసినట్లు గుర్తించాం. ఒంగోలుకు చెందిన మరో యువతితో బ్యాంకులో రూ.27 లక్షలకు లోన్‌ పెట్టించి, వాటిని తీసుకుని ఉడాయించినట్లు తేలింది. ఇలా మోసాలు చేస్తూ గంజాయి అక్రమరవాణా చేస్తూ తద్వారా వచ్చే నగదును షేర్‌మార్కెట్‌లో పెడుతున్నట్లు ఆధారాలు దొరికాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో చాలానగదు పోగొట్టుకుని మళ్లీ మోసాలకు పాల్పడుతున్న అతడిపై ప్రత్యేక బృందం నిఘా పెట్టింది. పక్కా సమాచారంతో చిత్తూరు నగర శివారులోని మురకంబట్టులో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. శ్రీనివాస్‌ ఇప్పటివరకు 30మంది యువతులను మోసం చేసి రూ.కోట్లలో నగదు కాజేసినట్లు తేలింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామ‌ని ఎస్పీ వివరించారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ బాలయ్య, ఎస్సైలు రామకృష్ణయ్య, లతను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *