అవ‌కాశాల కోసం పార్టీలు మారిన నేత‌లెంద‌రో తెలుసా..

Share On

జెండాలు మార్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు 500 మంది
అత్యధికులు వీడింది కాంగ్రెస్‌.. చేరింది భాజపా

దేశ‌వ్యాప్తంగా గ‌త ఏడు సంవ‌త్స‌రాల‌లో త‌మ అవకాశాలు.. అవ‌స‌రాలు.. స్వార్థం కోసం పార్టీలు మారిన ప్ర‌జ‌ల‌కు కోసం ప‌నిచేసే నేత‌లు మొత్తం 1,633 మంది.. ఇందులో 500 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక పార్టీని వదిలి మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం ముందు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఆ సంస్థ ఈ విశ్లేషణ చేసింది. ఈ వలసల్లో గరిష్ఠస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ 399 మందిని నష్టపోగా.. భాజపా అత్యధికంగా లబ్ధి పొంది 426 మందిని చేర్చుకొంది.

రాజకీయాలు ప్రజాప్రయోజనాలకు కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుండటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తినట్లు ఏడీఆర్‌ అభిప్రాయపడింది. అధికారం, ధనదాహం కారణంగా ఆయారాం గయారాం సంస్కృతి సర్వసాధారణంగా మారిపోయినట్లు పేర్కొంది. రానురాను విలువలతో కూడిన రాజకీయాలు సన్నగిల్లడం, సమర్థులు.. నిజాయితీపరులు.. విశ్వసనీయమైన నేతలు కొరవడటం, రాజకీయ పార్టీల పనితీరులో చట్టాలు జోక్యం చేసుకొనే పరిస్థితి లేకపోవడం, సీఆర్‌పీసీ సెక్షన్‌ 321ని దుర్వినియోగం చేసి కొందరు నేతలపై ఉన్న ప్రాసిక్యూషన్లను ఉపసంహరించుకోవడం వలసలకు ప్రధాన కారణాల ని విశ్లేషించింది.

కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 222 మంది నేతలు, 177 మంది ఎంపీలు/ ఎమ్మెల్యేలను కోల్పోయింది… వేర్వేరు పార్టీల నుంచి అభ్యర్థుల్లో 253 మంది, ఎంపీలు/ ఎమ్మెల్యేల్లో 173 మంది భాజపాలో చేరారు… పార్టీలు మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు భాజపా తర్వాత అత్యధికంగా కాంగ్రెస్‌ (61 మంది), తృణమూల్‌ కాంగ్రెస్‌లో (31 మంది) చేరారు… ఎక్కువమంది నేతలు వలసపోయిన పార్టీల్లో తెదేపా జాతీయస్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. 2014-21 మధ్యకాలంలో ఈ పార్టీకి చెందిన 32 మంది అభ్యర్థులు, 26 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. ఇదే సమయంలో తెదేపాలోకి ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు 11 మంది, ఎంపీలు/ ఎమ్మెల్యేలు 16 మంది చేరారు.

పార్టీలను వీడిన ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్యపరంగా కాంగ్రెస్‌ (177), భాజపా (33) తర్వాతి స్థానాల్లో తెదేపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ (26 మంది చొప్పున) నిలిచాయి… వైకాపాకు చెందిన ముగ్గురు అభ్యర్థులు, 16 మంది ఎంపీలు/ ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. ఇతర పార్టీలకు చెందిన 36 మంది అభ్యర్థులు, 24 మంది ఎంపీలు/ ఎమ్మెల్యేలు ఈ పార్టీలోకి వచ్చారు. అత్యధికులు వలస వచ్చిన పార్టీల జాబితాలో వైకాపా 5వ స్థానంలో నిలిచింది… తెరాస నుంచీ నలుగురు అభ్యర్థులు, నలుగురు ఎంపీ/ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. పక్క పార్టీల నుంచి 12 మంది అభ్యర్థులు, 30 మంది ఎంపీలు/ ఎమ్మెల్యేలు కారెక్కారు… ఎంఐఎంలోనూ పది మంది ఇతర పార్టీల అభ్యర్థులు, ఒక ప్రజాప్రతినిధి చేరారు… జనసేన పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ/ఎమ్మెల్యేలు వచ్చారు.

వలసల కారణంగా కాంగ్రెస్‌ తర్వాత అత్యధికంగా నష్టపోయిన పార్టీ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ. గత ఏడేళ్లలో ఈ పార్టీ నుంచి 153 మంది అభ్యర్థులు, 20 మంది ప్రజాప్రతినిధులు బయటకు వెళ్లిపోయారు. ఇతర పార్టీల నుంచి 65 మంది అభ్యర్థులు, 12 మంది ప్రజాప్రతినిధులు బీఎస్పీలో చేరారు… సమాజ్‌వాదీ పార్టీ నుంచి 60 మంది అభ్యర్థులు, 18 మంది ప్రజాప్రతినిధులు వేరే పార్టీలకు వెళ్లారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన 29 మంది అభ్యర్థులు, 13 మంది ప్రజాప్రతినిధులు సైకిలెక్కారు… జ‌నతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) నుంచి 59 మంది అభ్యర్థులు, 12 మంది ప్రజాప్రతినిధులు బయటకు వెళ్లారు. 23 మంది అభ్యర్థులు, 12 మంది ప్రజాప్రతినిధులు జేడీయూలోకి వచ్చి చేరారు… సిట్టింగ్‌ ఎంపీ/ఎమ్మెల్యేలుగా ఉండి పార్టీలు మారి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆస్తులపరంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (రూ.895 కోట్లు.. చేవెళ్ల) తొలిస్థానంలో.. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి (రూ.221 కోట్లు) రెండోస్థానంలో నిలిచారు..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu