హజూరాబాద్ ఉప ఎన్నిక వ్య‌క్తిగ‌త పోరుగానే భావిస్తున్నారా..

Share On

కొన్నె దేవేంద‌ర్‌.. ముందడుగు, ప్ర‌త్యేక ప్ర‌తినిధి. హైద‌రాబాద్‌

తెరపై ఈటల జన బలం కనిపిస్తోంది.. కానీ తెరవెనక నుంచి పరిస్థితి గమనిస్తే, అంతా టీఆర్ఎస్ కోవర్టులే అంటున్నారు. పక్కనే ఉండి ఈటల ఓటమి కోసం కృషి చేస్తున్న బ్యాచ్ ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆమధ్య ఈటల బావమరిది వాట్సప్ చాటింగ్, ఈటల గడియారాలు పంచే కార్యక్రమాల ఫుటేజీ, ఈటలకు దళితులు పాలాభిషేకం చేసి కాళ్లు కడిగిన వీడియోలు.. వైరిపక్షానికి నిముషాల్లో చేరిపోతున్నాయి.

ఇవన్నీ ఒక‌ కోవర్ట్ బ్యాచ్ చేస్తోంది, చేయిస్తోంది. తనవారెవరు, టీఆర్ఎస్ కోవర్టులెవరో తేల్చుకోలేక ఈటల తలపట్టుకుంటున్నారు. తెరపై దళితబంధు కనిపిస్తోంది. ఒక్కో కుటుంబం ఖాతాలో 10లక్షల రూపాయలు పడుతున్నాయి. కానీ తెరవెనక జరిగేది ఏంటంటే, దాదాపు 35వేల ఓట్లు ఈటల చేజారిపోతున్నాయి. ప్రభుత్వం తరపున దళితులకు సాయం, వారి ఓట్లన్నీ టీఆర్ఎస్ పార్టీకి ఖాయం అనేలా ఉంది అక్కడ పరిస్థితి. ప్రతిపక్షాలు దళితబంధుపై ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేస్తే టీఆర్ఎస్ కి అంత పబ్లిసిటీ, అంత లాభం కూడా. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని వైరి పక్షాలు డిమాండ్ చేస్తూ, తామేదో కేసీఆర్ ని ఇరుకున పెట్టినట్టు భావిస్తున్నాయి. కానీ కేసీఆర్ అన్నిచోట్లా అమలు చేస్తామంటూనే, ముందు హుజూరాబాద్ లో పని కానిస్తున్నారు. ఇక్కడ ఓట్ల లెక్కలు తేలితే.. మెల్లగా వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఓట్లకు మూకుమ్మడి గేలం వేసినట్టే.

మైక్ ముందు చాలా మాటలు మాట్లాడతారు. ఎంతో అభివృద్ధి చేస్తామంటారు. కానీ ఓటరును ప్రభావితం చేసేది అది కాదు. తెరవెనక నేతలు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఎంత లాబీయింగ్ చేస్తున్నారనేది విజయానికి కీలకం. ప్రస్తుతం హుజూరాబాద్ లో అదే జరుగుతోంది. కేసీఆర్ ఆ పనిని అత్యంత చాకచక్యంగా, పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈటలకు చుక్కలు చూపిస్తున్నారు. తెరపై కులాల అభివృద్ధి పథకాలే కనిపిస్తున్నాయి. కానీ తెరవెనక చూస్తే మాత్రం కులాల వారీగా పంపకాలు ఆల్రెడీ జరిగిపోయాయి. దళితుల్ని ఇప్పటికే తనవైపు తిప్పుకున్న కేసీఆర్.. ఇతర సామాజికవర్గాలన్నింటినీ తెరవెనక సంతోషపెట్టారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ప్రతి సామాజిక వర్గానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయా కుల నాయకులతో టచ్ లోనే ఉన్నారు. వారెవరూ ఈటలవైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేశారు.
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి ఆకాశాన్నంటుతుందనే హామీలు కనపడుతున్నాయి. తెరవెనక మాత్రం ఈటల గెలిస్తే హుజూరాబాద్ నాశనం అనే వార్నింగులు వినపడుతున్నాయి.

దళితబంధు అందకుండా చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు కింది స్థాయి నేతలు. ఈటలను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావని తేల్చి చెప్పేస్తున్నారు. హుజూరాబాద్ లో తటస్థులు కూడా ఇప్పుటు టీఆర్ఎస్ వైపు నిలబడుతున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నికలను కేసీఆర్, ఈటల వ్యక్తిగత పోరుగానే వారు భావిస్తున్నారు. ఈ పోరులో ఈటల వైపు నిలబడి తామెందుకు నష్టపోవాలి, నియోజకవర్గ అభివృద్ధికి ఎందుకు అడ్డుపడాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈటల గెలిస్తే ఏమవుతుందో తెలియదు కానీ, టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే.. ఎన్నికలొచ్చే వరకు తమకి కాస్తో కూస్తో పనులు జరుగుతాయనే భావన వారిలో ఉంది. కేసీఆర్ కి కావాల్సింది కూడా అదే. ఎన్నికలను వీలైనన్ని రోజులు వాయిదా వేసి, ఆలోగా నియోజకవర్గ ప్రజలకు బ్రెయిన్ వాష్ చేసి, ఈటలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని కేసీఆర్ ప్లాన్ వేశారు.
ఈటలకే కాదు, పార్టీలో తనని, తన కుటుంబాన్ని ఎదిరించేవారికి, లోపాల్ని ఎత్తి చూపాలనుకునేవారికి కూడా ఇదో పెద్ద గుణపాఠం కావాలనేది కేసీఆర్ ఆలోచన. అందుకే ఆయన ఈ ఎన్నికను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెరవెనక పనులు చక్కబెడుతున్నారు


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version